Sep 20,2023 21:45
  • అన్ని పార్టీలప్రణాళికలో పెట్టాలి
  • విశాఖలో ఉక్కు రక్షణ బైకు యాత్ర ప్రారంభం

ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ అజెండాతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు 2024 ఎన్నికలకు రావాలని, అలా చేయని పక్షంలో ప్రజాగ్రహానికి గురికాకతప్పదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించకుండా, ముడిసరుకు రాకుండా ఉత్పత్తిని అడ్డుకుంటోందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీక రించం అని బిజెపి ప్రకటన చేయకుంటే వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ నాయకులను విశాఖలో ప్రజానీకం తిరగనివ్వదని హెచ్చరించారు. బుధవారం ఉదయం 11 గంటలకు విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యాన తలపెట్టిన ఉక్కు రక్షణ బైకు యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ నెల 29 వరకూ ఉత్తరాంధ్రలో సాగే ఈ బైకు యాత్రకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. 'ఉక్కు మాదే-హక్కు మాదే' అని రెండేళ్లుగా కార్మికులు పట్టువిడవకుండా పోరాడుతుండడాన్ని ఆయన అభినందించారు. రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు స్టీల్‌ప్లాంట్‌కు మా మద్దతు అంటూ ఉపన్యాసాలిస్తున్నాయి మినహా బిజెపికి వ్యతిరేకంగా పోరాటాల్లోకి రావడం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ప్రధాన అజెండా ఉక్కు పరిరక్షణ కానుందని తెలిపారు. కార్మిక సంఘాలన్నీ 950 రోజులకు పైబడి పోరాడుతుండడంతో కేంద్రం తన స్ట్రాటజిక్‌ సేల్‌ నుంచి ఒక్క అడుగూ ముందుకేయలేకపోయిందని గుర్తు చేశారు. స్టీల్‌ప్లాంట్‌ను ఎండగట్టేసి భూములను అదానీ, అంబానీ, జిం వంటి అధిపతుల్లో ఎవరికి అమ్ముదామా? అన్న యావ మోడీలో ఎక్కువైందని దుయ్యబట్టారు. స్టీల్‌ప్లాంట్‌ ఇచ్చిన భూముల్లో గంగవరం పోర్టు ఏర్పాటు చేసి ఇప్పుడు అదానీ పరం చేసి కార్మికులను హింస పెట్టడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా కార్మికవర్గం పెద్ద ఎత్తున ఉద్యమిస్తోందన్నారు.
బైక్‌ యాత్రకు నాయకత్వం వహిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాథం మాట్లాడుతూ ప్రజా యాత్రగా ఉక్కు రక్షణ బైకు యాత్ర సాగనుందన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ నెల 29 వరకూ పది రోజులపాటు 1,150 కిలోమీటర్లు కొనసాగనుందని తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ పూర్వ వైస్‌ ఛాన్సలర్‌ వి.బాలమోహన్‌దాస్‌ మాట్లాడుతూ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడంతో అధిక భారం మోయాల్సి వస్తోందన్నారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరాం, సిపిఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు వై.కొండయ్య, ఐఎన్‌టియుసి నాయకులు రామచంద్రరావు, రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వివి.రమణమూర్తి, సిపిఐ ఎంఎల్‌ ప్రజాపోరు నాయకులు దేవా, సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

  • ఉత్సాహంగా బైకుయాత్ర

ఈ బైకు యాత్రకు రథసారథిగా ఉన్న కె.లోకనాథానికి ముందుగా వి.శ్రీనివాసరావు పార్టీ కండువా వేసి జెండా ఊపి బైకు యాత్రను ప్రారంభించారు. అనంతరం ద్వారకానగర్‌ ఆర్‌టిసి కాంప్లెక్స్‌, మద్దిలపాలెం, హనుమంతువాక, మధురవాడ, తగరపువలస మీదుగా విజయనగరానికి బైకు యాత్ర చేరుకుంది.

  • చంద్రబాబు అరెస్టు తీరు అభ్యంతరకరం

టిడిపి అధినేత చంద్రబాబునాయుడును అరెస్ట్‌ చేసిన తీరు అభ్యంతరకరమని వి.శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ విధంగా అరెస్టు చేయడం కక్షసాధింపు అని, అందుకు ఆస్కారం లేకుండా అవినీతిపై విచారణ కొనసాగించి దోషులను శిక్షించాలని అన్నారు. ఉక్కు రక్షణ బైక్‌ యాత్రను ప్రారంభించేందుకు బుధవారం విశాఖ వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు 'చంద్రబాబు అరెస్టును మీ పార్టీ ఎలా చూస్తుంది?' అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు.