ప్రజాశక్తి - ఉక్కునగరం (విశాఖపట్నం):వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 985వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, క్యుఎటిడి, ఆర్‌అండ్‌డి, ఇటిఎల్ విభాగాలకు చెందిన ఉద్యోగులు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని కేంద్ర ప్రభుతాన్ని డిమాండ్ చేశారు. ఆ దిశగా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలూ ఒకే తాటిపైకి వచ్చి ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజల ఆస్తి అని, వాటిని అమ్మే హక్కు కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. దీక్షల్లో పోరాట కమిటీ నాయకులు రామస్వామి, ఎంఆర్.నాగేశ్వరరావు, రామచంద్రరావు, హనుమంతరావు, గుమ్మడి నరేంద్ర, నాయక్ పాల్గొన్నారు.










