ప్రజాశక్తి-ఉక్కునగరం (విశాఖపట్నం):విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ప్రకటన చేసేంతవరకూ పోరాటం ఆగదని, ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 992వ రోజుకు చేరాయి. దీక్షలో స్టీల్ ప్లాంట్ సిఒ సిసిపి కార్మికులు కూర్చున్నారు. వీరినుద్దేశించి పోరాట కమిటీ నాయకులు జె.రామకృష్ణ మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటుకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి ఎదురు తిరిగి పోరాడుతున్నామని, కార్మికులు, నిర్వాసితులు ప్రజలందరి మద్దతుతో ఉద్యమం కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఇంకా సుమారు ఎనిమిది వేల మంది ఉక్కు నిర్వాసితులకు ఇప్పటికీ శాశ్వత ఉపాధి లేదని తెలిపారు. విశాఖ ఉక్కు సెగ దేశవ్యాప్తంగా వెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో టి.కనకరాజు, కర్రి బాబూరావు, కె.ఆనంద్‌కుమార్, ఎస్‌కె.మొహిద్దీన్, కె.సుబ్బారావు, వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










