తెలంగాణ : ప్రపంచంలోనే అత్యంత పెద్ద లిఫ్ట్ ఇరిజేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలో 20వ పియర్ ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. ఈ ఘటనపై తాము కోరిన మరింత సమాచారాన్ని ఆదివారంలోగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మరో లేఖ రాసింది.
మేడిగడ్డ బ్యారేజిలో భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఈనెల 23 నుంచి 26 వరకు కేంద్ర కమిటీ ప్రాజెక్టును సందర్శించింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారం ఇచ్చింది. అయితే కమిటీ తిరుగు ప్రయాణానికి ముందే.. వారు అడిగిన మరికొన్ని వివరాలు ఇవ్వలేదని ఆ వివరాలను ఇవ్వాలని కేంద్రం మరోసారి లేఖ రాసింది. మొత్తం 20 అంశాల సమాచారాన్ని కేంద్రం కోరింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 3 అంశాల వివరాలు మాత్రమే ఇచ్చిందని, మిగతా వివరాలు ఇవ్వాలని అధికారులు తెలిపారు.










