Nov 11,2023 15:24

శాయంపేట:ఈనెల 30న జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలోని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బందికి, ఓటు వేయడానికి వచ్చే ఓటర్లకు సదుపాయాలు కల్పించాలని ఎన్నికల సెంట్రల్‌ అబ్జర్వర్‌ అభయ్ నందన్‌ అభస్థా అధికారులకు సూచించారు. మండలంలోని శాయంపేట, పత్తిపాక, కొత్తగట్టుసింగారం గ్రామాలలోని పోలింగ్‌ కేంద్రాలను శుక్రవారం ఆయన సందర్శించి పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాలలో విద్యుత్‌ సౌకర్యం ఉందా, కేంద్రాలలోని గదులకు కిటికీలు ఉన్నాయా, మరుగుదొడ్లు వినియోగంలో ఉన్నాయా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బందికి, ఎన్నికల రోజు వచ్చే ఓటర్లు వినియోగించుకునేందుకు బాత్రూమ్స్‌ శుభ్రంగా ఉంచాలని అన్నారు. త్రాగునీరు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని, దివ్యాంగులకు ర్యాంప్‌ సౌకర్యం ఏర్పాటు చేయాలని అన్నారు. ఆయన వెంట భూపాలపల్లి ఏ డి ఏ నర్సింగం, తహసిల్దార్‌ సుభాషిని, ఎంపీడీవో ఆమంచ కఅష్ణమూర్తి పాల్గొన్నారు.