Jul 15,2023 22:25

పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారు
బ్యాంకాక్‌: ఆసియా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ లాంగ్‌జంప్‌ విభాగంలో మురళీ శ్రీశంకర్‌ రజత పతకం సాధించి పారిస్‌ ఒలింపిక్స్‌కు బెర్త్‌ సాధించాడు. శనివారం జరిగిన లాంగ్‌జంప్‌ ఫైనల్లో శ్రీశంకర్‌ 8.37మీటర్ల దూకి రెండో స్థానంలో నిలిచాడు. మొదటి ప్రయత్నంలో 8.10 మీటర్ల దూరం దూకిన శ్రీశంకర్‌.. మూడో ప్రయత్నంలో 8.12మీటర్లు, ఐదో ప్రయత్నంలో 8.37మీటర్లతో రికార్డు నమోదు చేశాడు. ఈ పోటీల్లో చైనీస్‌ తైపీ లాంగ్‌ జంపర్‌ యూ టాంగ్‌ లిన్‌ 8.40 మీటర్ల దూరం దూకి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మింగ్‌కున్‌ జాంగ్‌ నుంచి గట్టి పోటీ ఎదురైంది. శ్రీశంకర్‌ అత్యుత్తమ జంప్‌ 8.41 మీటర్లు కాగా.. ఫైనల్లో ఆ మార్క్‌ను అందుకోలేకపోయాడు.
కరణ్‌వీర్‌ సింగ్‌కు పాజిటివ్‌..
భారత యువ షాట్‌పుటర్‌ కరణ్‌వీర్‌ సింగ్‌ డోప్‌ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. పాటియాలాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌(ఎన్‌ఐఎస్‌)లో శిక్షణ పొందిన కరణ్‌వీర్‌ సింగ్‌ జులైలో ఈ పోటీలకోసం ఎంపికైన 54అధ్లెట్ల బృందంలో ఓ సభ్యుడు. శనివారం థారులాండ్‌కు బయలుదేరి వెళ్లాల్సి ఉండగా.. అతని నుంచి సేకరించిన శ్యాంపిల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని భారత అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఆదిల్లే సుమరివాలా ధృవీకరించారు. కరణ్‌వీర్‌ సింగ్‌ నుంచి సేకరించిన శాంపిల్స్‌త పాజిటివ్‌గా వచ్చినట్లు ఆయన తెలిపారు.