Oct 19,2023 12:34

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తరపున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు హెల్త్‌ కండీషన్‌పై మెమో దాఖలు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైద్యుల సిఫార్సు చేసిన అంశాలను కోర్టుకు సిద్ధార్థ లూథ్రా వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందిగా మారుతుందని కోర్టుకు తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబుకు 2 వారాల మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తెలిపారు. అయితే రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబుకు వైద్యం అందుతుందని ఏజీ శ్రీరాం వాదనలు వినిపించారు. ప్రభుత్వ వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నట్లు కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న మెడికల్‌ రిపోర్టులు, హెల్త్‌ బులెటిన్లపై తమకు అనుమానాలు ఉన్నట్లు సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వైద్యం చేసేందుకు వ్యక్తిగత వైద్యులను అనుమతి ఇవ్వాలని కోరారు. ఇరువురు వాదనలు విన్న హైకోర్టు మధ్యాహ్నాం 2.15 గంటలకు ఏపీ హైకోర్టు పాస్‌ ఓవర్‌ తెలిపింది. లంచ్‌ అనంతరం వాదనలు విని తీర్పు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.