ఎవరైనా ఏమైనా సరిగా చేయకపోతే 'నీకు మెదడుందా? / దమాక్ ఖరాబైందా? మైండ్ పనిచేస్తల్లేదా?' అని అంటుంటాం. మరి మెదడు మన శరీరానికి కంప్యూటర్‌లో మదర్‌బోర్డులాంటిది. అది లేకపోతే అంతా అయోమయమే. మనం చేసినవి, చదివినవి నిక్షిప్తం చేసుకోవాలంటే కూడా మెమరీకార్డు మెదడే. మన మానసిక స్థితిని సరైనదిశలో ఉంచేది కూడా మెదడే. మరి అలాంటి మెదడు ఆరోగ్యం అత్యంత కీలకమైంది. మరి మెదడు ఆరోగ్యానికి ఆరు అద్భుతమైన ఆహారాలను సూచిస్తున్నారు పోషకాహార నిపుణులు. అవేంటో చూసేద్దాం.
ఈ సందర్భంగా మన మానసిక స్థితితో పాటు మెదడు శక్తిని బలోపేతం చేసే ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సుగంధ ద్రవ్యాలు
సుగంధ ద్రవ్యాల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పసుపు వంటి వాటిలో ఆంగ్జైటీని తగ్గించే లక్షణాలు అధికం. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం మెదడు కెమిస్ట్రీని మార్చడం ద్వారా ఆంగ్జైటీని తగ్గిస్తుంది. మానసికారోగ్య నిపుణులు ఎక్కువగా పేర్కొనే మరో సుగంధద్రవ్యం కుంకుమ పువ్వు. కుంగుబాటుకు సంబంధించిన ప్రధాన సమస్యలపై మెరుగ్గా పనిచేసే లక్షణాలు కుంకుమ పువ్వులో అధికంగా ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. కుంగుబాటుతో బాధపడుతున్న రోగులు కుంకుమపువ్వును తీసుకోవడం ద్వారా ఆ లక్షణాలు గణనీయంగా తగ్గిపోతాయని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
పులియబెట్టిన ఆహారాలు
పులియబెట్టిన ఆహారాల్లో అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. ఈస్ట్ వంటి సూక్ష్మజీవి సంబంధిత ఆహారాలను పాలు, కూరగాయలు, ఇతర పదార్థాలతో కలిపి ఈ వెరైటీలను తయారుచేస్తారు. పెరుగు దీనికి మంచి ఉదాహరణ. పెరుగుతో పాటు సార్‌క్రట్, కిమ్చీ, కొంబుచా వంటివి కూడా ఈ కేటగిరీకి చెందినవే. సార్‌క్రట్ అంటే క్యాబేజీని వేడినీళ్లల్లో వెనిగర్, ఉప్పు వేసి, నిల్వ ఉంచినది. కిమ్చీ అంటే కొరియన్ వాళ్లు కూరగాయ ముక్కల్ని ఉప్పు వేసి ఊరబెట్టిన ఆహారం. ఇక కొంబుచా అంటే టీలో ఈస్ట్, చక్కెర, బ్లాక్‌టీ కలిపి వారం పాటు నిల్వ ఉంచుతారు. ఇలాంటి పుల్లియబెట్టిన ఆహారాలు అన్నింటిలో ఉమ్మడిగా ఉన్న వనరు ఏంటంటే మంచి బ్యాక్టీరియా. పేగుల పనితీరును ఈ మంచి బ్యాక్టీరియా మెరుగుపరచడంతో పాటు ఆంగ్జైటీని తగ్గిస్తుంది. పులియబెట్టిన ఆహారాల వల్ల మెదడుకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. తెలివితేటల్ని పెంచుకునేలా, విజ్ఞానాన్ని సముపార్జించే శక్తిని కలిగిస్తాయని 2016 నాటి 45 అధ్యయనాలపై చేసిన ఒక విశ్లేషణ తేల్చింది. మంచి బ్యాక్టీరియా పుష్కలంగా ఉండే పెరుగూ చాలా శక్తిమంత మైన ఆహారమని నిపుణులు చెప్తున్నారు.
వాల్‌నట్స్
వాల్‌నట్స్‌లో ఉండే యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మన జ్ఞాపకశక్తి, ఆలోచన ను మెరుగుపరచడంలో గొప్పగా పనిచ ేస్తాయి. మరోవైపు, నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, నూనెలు ఉంటాయి. మన మెదడు సరిగ్గా పనిచేయడానికి ఇవి చాలా అవసరం. వీటితో పాటు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. సలాడ్స్, కూరగాయ లతో పాటు రోజుకు పావు కప్పు చొప్పున నట్స్‌ను తినాలనేది నిపుణులు చెప్తున్న మాట.
డార్క్ చాక్లెట్
డార్క్ చాక్లెట్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేసే రసాయనాలను నియంత్రించడంలో సహాయ పడుతుంది. 2019లో 13 వేల మంది వ్యక్తులపై జరిపిన సర్వేలో అద్భుతమైన వాస్తవాలు వెల్లడయ్యాయి. అవేంటంటే.. డార్క్ చాక్లెట్‌ను తరచుగా తినే వారిలో డిప్రెషన్ బారిన పడే ప్రమాదం 70 శాతం తక్కువ. డార్క్ చాక్లెట్‌లోనూ బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు ఉండి, అధిక ప్రయోజనాలను చేకూరుస్తాయి.
అవకాడో
మెదడు పనితీరుకు ఎంతో ముఖ్యమైన మెగ్నీషియం అధిక మొత్తంలో అవకాడోల్లో లభిస్తుంది. డిప్రెషన్ అనేది మెగ్నీషియం లోపం వల్ల తలెత్తుతుంది. డిప్రెషన్ రోగులకు 125-300మి.గ్రా మెగ్నీషియంతో చికిత్స అందించినప్పుడు వారు వేగంగా కోలుకున్నట్లు చూపే కేస్ స్టడీలు అనేకం. సాండ్‌విచ్ వంటివాటిల్లో అవకాడో, మిగిలిన కూరగాయ ముక్కలు తీసుకోవచ్చు. అవకాడోను సలాడ్స్‌లో వేసుకుని కూడా తినొచ్చు.
ఆకు కూరలు
ఆకు కూరలు అన్నిరకాలుగా చాలా మంచివి. ఆకుకూరల్లో విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి మానసిక స్థితిని స్థిరంగా ఉంచేలా చేస్తాయి. అంతేకాదు తెలివితేటలు పెంపొందించేందుకు తోడ్పడతాయి. ఆకుకూరల వల్ల లభించే మరో ప్రయోజనం వీటిల్లో అధికంగా ఉండే ఫొలేట్. విటమిన్ బి-9కు ఫొలేట్ అనేది సహజ రూపం. ఎర్ర రక్త కణాలు ఏర్పడటంలో ఇదే కీలకం.
కొన్ని నాడీ సంబంధితమైన వాటికి ఫొలేట్ లేమి కారణంగా ఉండొచ్చు. న్యూరోట్రాన్స్‌మీటర్ల ఉత్పత్తిలో ఈ విటమిన్ చాలా ముఖ్యమైనది. పాలకూర వంటి ఆకుకూరల్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.










