- మూడో టి20లో విండీస్‌పై ఏడు వికెట్ల తేడాతో గెలుపు
- సిరీస్ ఆశలు సజీవం
గయానా : టి20 సిరీస్‌లో వెనుకబడ్డ టీమిండియా నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో రాణించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో కేవలం 3వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిస్టర్ 360 డిగ్రీస్ సూర్యకుమార్ కేవలం 44 బంతుల్లో 10ఫోర్లు 4 సిక్సర్ల సాయంతో ఏకంగా 83పరుగులకు తోడు నిలకడగా రాణిస్తున్న హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ(49నాటౌట్) టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించారు. సూర్యకుమార్ యాదవ్ ఔటయ్యే సమయానికే సరికే టీమిండియాను విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా(20నాటౌట్) చివర్లో సిక్సర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్‌కు లభించింది. తొలుత టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను కుల్దీప్ యాదవ్(3/28) తన స్పిన్ మాయాజాలంతో కట్టడి చేశాడు. దీంతో వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో విండీస్ 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 45, కైల్ మేయర్స్ 25 పరుగులు చేసి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన నికోలాస్ పూరన్ తొలుత మెరుపులు మెరిపించినా.. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో జాన్సన్ చార్లెస్(12), పూరన్‌లను అవుట్ చేసి విండీస్ జోరుకు కళ్లెం వేశాడు. పూరన్ 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్ రోవ్ మాన్ పావెల్ ధాటిగా ఆడడంతో విండీస్ స్కోరు 150 మార్కు దాటింది. పావెల్ 19 బంతుల్లో ఫోర్, 3సిక్సులతో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు మూడు, అక్షర్ పటేల్, ముఖేశ్ కుమార్‌కు ఒక్కో వికెట్ దక్కాయి. ఛేదనలో టీమిండియా అరంగేట్రం హీరో యశస్వి జైస్వాల్(1) అభిమానులు పెట్టుకున్న ఆశలను అడియాశలు చేశాడు. శుభ్‌మన్(8) కూడా నిరాశపరచడంతో టీమిండియా 34 పరుగులకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో సూర్యకుమార్ యాదవ్(83)కి తోడు తిలక్ వర్మ(49), హార్దిక్(20) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు. నాల్గో టి20 12న శనివారం జరగనుండగా.. ఐదు టి20ల సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు 2-1 ఆధిక్యతలో ఉంది.










