న్యూఢిల్లీ : '' కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడి కొత్త చట్టాలను స్వాగతించాలి '' అని ప్రధాని మోడి అన్నారు. మంగళవారం పాత పార్లమెంటు భవనం వద్ద పార్లమెంటు సభ్యులంతా చేరుకొని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫోటోలను దిగారు. కొత్త పార్లమెంటు భవనంలో నేటి నుండి ప్రత్యేక సమావేశాలను ప్రారంభించనున్న వేళ ... ముందుగా ఉభయ సభల సభ్యులు పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటరీ వారసత్వంపై అందులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన మంత్రి మోడి ప్రసంగించారు.
ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం ఈ సెంట్రల్ హాల్ : ప్రధానమంత్రి మోడి
ప్రధాని మోడి మాట్లాడుతూ ... ఈ సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. పాత పార్లమెంట్ భవనం ఇకపై సంవిధాన్ సదన్‌గా ఉండనుందని ప్రకటించారు. మన రాజ్యాంగం ఈ సెంట్రల్ హాల్‌లోనే రూపుదిద్దుకుందని తెలిపారు. ఆంగ్లేయుల నుంచి రాజ్యాధికారం అందుకున్నది కూడా ఈ సెంట్రల్ హాల్‌లోనేనన్నారు. 1952 నుంచి 41 మంది వివిధ దేశాధ్యక్షులు ఇక్కడే ప్రసంగించారని గుర్తు చేశారు. రాష్ట్రపతులు 86 సార్లు ఇక్కడ తమ ప్రసంగాలను వినిపించారని అన్నారు. ఇక్కడి నుంచే 4 వేలకుపైగా చట్టాలను ఆమోదించుకున్నామని హర్షాన్ని వ్యక్తం చేశారు. అనేక కీలక చట్టాలను ఉమ్మడి సమావేశాల ద్వారా ఆమోదించుకున్నామన్నారు. తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ట్రిపుల్ తలాక్ చట్టాలు ఇక్కడే ఆమోదం పొందాయన్నారు. ఆర్టికల్ 370 నుంచి విముక్తి కూడా పార్లమెంట్ ద్వారానే జరిగిందన్నారు. దాంతో ప్రస్తుతం జమ్మూకాశ్మీర్ శాంతిపథంలో పయనిస్తోందని ప్రధాని మోడి చెప్పారు. తమ ప్రభుత్వం ఒక్కొక్కటిగా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధాని అన్నారు.
పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా పెద్ద మార్పులు తీసుకురాలేం : ప్రధాని మోడి
'' మా ప్రభుత్వం తీసుకుంటోన్న నిర్ణయాలతో భారత్‌లో కొత్త చైతన్యం వస్తోంది. మనం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటామో అంత వేగంగా ఫలితాలు వస్తాయి. సాంకేతికతను అందించడంలో మన దేశ యువత ముందువరుసలో ఉంది. ప్రజల ఆకాంక్షలు ఉజ్వలంగా ఎగసిపడుతున్నాయి. వాటిని అందుకునే ప్రయత్నం నిరంతరం సాగాలి. అందుకే కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడి కొత్త చట్టాలను స్వాగతించాలి. పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా పెద్ద మార్పులు తీసుకురాలేం. అయిదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. త్వరలో మూడో ఆర్థిక వ్యవస్థగా మారుతుంది '' అని ప్రధాని మోడి అన్నారు. ప్రపంచంలో నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరత ఉందని, దానిని భారత్ పూరించాలని మోడి కోరారు.










