Aug 03,2023 22:05

మిధున్‌, కిరణ్‌ జార్జి ఔట్‌..
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్‌ సూపర్‌500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో పివి సింధు, కిదాంబి శ్రీకాంత్‌తోపాటు హెచ్‌ఎస్‌ ప్రణయ్ రాయ్ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లగా.. మిధున్‌ మంజునాథ్‌, కిరణ్‌ జార్జి రెండోరౌండ్‌లో ఓటమిపాలయ్యారు. గురువారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో ప్రణయ్ 19-21, 21-19, 21-13తో చైనీస్‌ తైపీ ఆటగాడు చి-యూాజెన్‌పై పోరాడి నెగ్గాడు. తొలి సెట్‌ కోల్పోయినా.. పట్టుదలతో పోరాడిన ప్రణయ్ చివరి రెండు సెట్లు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌ సుమారు 74 నిమిషాల పాటు హోరాహోరీగా సాగింది. మరో మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 21-10, 21-17తో చైనీస్‌ తైపీకే చెందిన సుాలీాయాంగ్‌పై సునాయాసంగా విజయం సాధించాడు. ఇక ప్రియాంశు రాజ్‌వత్‌ 21-8, 13-21, 21-19తో ఉత్కంఠ పోరులో చైనీస్‌ తైపీ ప్లేయర్‌ వాంగ్‌ జూ వీను చిత్తు చేసి క్వార్టర్స్‌కు చేరాడు. ఏడో ర్యాంకర్‌ను చిత్తు రెండోరౌండ్‌కు చేరిన భారత యువ సంచలనం మిధున్‌ మంజునాథ్‌ నిరాశ పరిచాడు. మలేషియా ఆటగాడు లీ జీ జియా చేతిలో 13-21, 21-12, 19-21తో జి-జియాాలీ(మలేషియా) చేతిలో పోరాడి ఓడాడు. ఇక కిరణ్‌ జార్జి 15-21, 18-21తో ఆంటోనీ గింటింగ్‌(ఇండోనేషియా) చేతిలో వరుససెట్లలో ఓడాడు. ఇక మహిళల సింగిల్స్‌లో పివి సింధు 21-14, 21-10తో భారత్‌కే చెందిన ఆకర్షీ కశ్యప్‌ను చిత్తు చేసి క్వార్టర్స్‌ చేరింది. క్వార్టర్‌ఫైనల్లో 4వ సీడ్‌ బివెన్‌ జంగ్‌(అమెరికా)తో తలపడనుంది.