Sep 24,2023 07:19
  • బిధూరి వ్యాఖ్యలు సభా హక్కుల ఉల్లంఘనే

న్యూఢిల్లీ : బిఎస్‌పి ఎంపి దనీష్‌ అలీపై గురువారం రాత్రి లోక్‌సభ వేదికగా దూషణలకు దిగిన బిజెపి ఎంపి రమేష్‌ బిధూరిని సస్పెండ్‌ చేయాల్సిందేనని ప్రతిపక్ష పార్టీలు పట్టుబట్టాయి. బిధూరి వ్యవహారం సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని, కాబట్టి దీనిని సభా హక్కుల కమిటీకి నివేదించాలని నాలుగు ప్రతిపక్ష పార్టీలు స్పీకర్‌కు రాసిన లేఖలో కోరాయి. బిఎస్‌పి అధ్యక్షురాలు మాయావతి ఆలస్యంగా స్పందించారు. బిధూరిపై బిజెపి సముచితమైన చర్య తీసుకోకపోవడం విచారకరమని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.సభా హక్కుల కమిటీ తన దర్యాప్తును పూర్తి చేసేవరకూ ఎంపి బిధూరిని సస్పెండ్‌ చేయాలని కోరుతూ లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, డిఎంకె ఎంపి కనిమొళి, ఎన్‌సిపి నేత సుప్రియా సులె, టిఎంసి నేత అపురూప పొద్దార్‌ స్పీకర్‌కు లేఖ రాశారు. ఇండియా ఫోరమ్‌లోని ఇతర సభ్య పార్టీల నుండి కూడా మరిన్ని లేఖలు రానున్నట్లు సమాచారం.
            ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన సభ్యునిపై పార్లమెంట్‌ చరిత్రలోనే ఎన్నడూ ఇలాంటి అనుచిత పదజాలాన్ని ఉపయోగించలేదని అధిర్‌ రంజన్‌ చౌదరి తన లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలో వచ్చేసినందున వీటిని రికార్డుల నుంచి తొలగించినా పెద్ద ప్రభావమేమీ వుండదన్నారు. గొడవ జరుగుతున్న సమయంలో... నవ్వుకుంటూ కనిపించిన ఇద్దరు మాజీ కేబినెట్‌ మంత్రులు రవిశంకర్‌ ప్రసాద్‌, హర్ష వర్ధన్‌ వైఖరి పట్ల కూడా సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. బిధూరితో సహా వారి వైఖరిని కూడా ఖండించాల్సి వుందని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ పోస్ట్‌ చేశారు. ''బిజెపి ఎంపి బిధూరి ప్రసంగం సాగుతున్నపుడు సభలో గందరగోళంగా వుంది. బిధూరి ఏం అంటున్నారో చూడండి అంటూ దనీష్‌ అలీ నన్ను అప్రమత్తం చేసిన వెంటనే నేను ఆఅన్‌పార్లమెంటరీ పదజాలాన్ని రికార్డుల నుండి తొలగించాలంటూ రూలింగ్‌ ఇచ్చాను, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కూడా బిధూరి తరపున క్షమాపణ చెప్పారు, కానీ బిధూరిని సస్పెండ్‌ చేసే అధికారం నా చేతుల్లో లేదు.'' అని వాగ్వాదం జరిగిన సమయంలో సభాధ్యక్ష స్థానంలో వున్న కాంగ్రెస్‌ ఎంపి సురేష్‌ చెప్పారు. ఇలాంటి అసహ్యకరమైన భాషను బిధూరి మాట్లాడడం ఇదే మొదటిసారి కాదని ఆయన అన్నారు. ఆర్‌జెడి ఎంపి మనోజ్‌ ఝా విలేకరులతో మాట్లాడుతూ, మైనారిటీ ఎంపిపై పార్లమెంట్‌లో ఇటువంటి అసభ్యకర పదజాలాన్ని ఉపయోగించడం బిజెపి నైజాన్ని బయటపెడుతోందని అన్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ, బిధూరి వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు.