ముంబయి : రానున్న 15-20 రోజుల్లో ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ బిజెపితో చేతులు కలుపుతారని మహారాష్ట్రలోని అమరావతి ఎమ్మెల్యే రవి రాణా చేసిన ప్రకటనపై ఎన్‌సిపి స్పందించింది. ఆయన ఎప్పటికీ బీజేపీతో చేతులు కలపడని స్పష్టం చేసింది. ఇండియా ఫోరమ్‌తోనే ఉంటారని వివరించింది. ''శరద్ పవార్ జాతీయ స్థాయిలో ఇండియా ఫోరమ్‌తోపాటు మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ (ఎంవిఎ) కూటమితో కలిసి ఉంటారు'' అని ఎన్‌సిపి పేర్కొన్నది. ''మా పార్టీ అధినేత శరద్ పవార్ బిజెపితో చేతులు కలుపుతారని ఎవరు వాదించినా స్పందించాల్సిన అవసరం లేదు. మా పార్టీ చీఫ్ ఇండియా కూటమి, మహా వికాస్ అఘాడితో ఉంటారు. ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో ఆయన ముందున్నారు. బిజెపిని అధికారానికి దూరం చేసేందుకు ఆయనపై విపక్షాలు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాయి. దేశానికి ప్రమాదకరమైన సిద్ధాంతాన్ని మా పార్టీ అధినేత ఎప్పటికీ అనుసరించరు. 2024 ఎన్నికల్లో బిజెపిని అధికారం నుంచి గద్దె దించేందుకు ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు'' అని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి అధికార ప్రతినిధి మహేశ్ తపసే అన్నారు.










