మహారాష్ట్ర : స్క్రబ్‌టైఫస్ వైరస్ భయంతో ఒడిశా వణికిపోతోన్న సంగతి విదితమే.. ఒడిశాలో ఈ వైరస్ వ్యాధి విజృంభిస్తుంది.. ఈ వైరస్ కేవలం ఒడిశాలోనే కాకుండా మహారాష్ట్రకూ, హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాకు పాకింది. అయితే ఈ వైరస్‌ను అరికట్టేందుకు వ్యాక్సిన్ లేకపోవడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనిని అరికట్టడం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు, జిల్లా యంత్రాంగానికి పెను సవాల్‌గా మారింది.
ఒడిశాలో 210 కేసులు
ఒడిశాలో ఇప్పటికే 210 కి పైగా స్క్రబ్‌టైఫస్ కేసులు నమోదయ్యాయి. మరో ఐదుగురు ఈ వైరస్ బారినపడి చనిపోయారు.
మహారాష్ట్రలో 16 కేసులు
మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జల్నా, బుల్దానా జిల్లాల్లో ఈ వైరస్ బాధితులను వైద్యులు గుర్తించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి మొత్తం 16 కేసులు నమోదయ్యాయి. స్క్రబ్‌టైఫస్ కేసులు నమోదవుతున్న వేళ ... మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే నియంత్రణ చర్యలు చేపట్టారు. వైరస్ సోకిన ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఐదుగురు మృతి...
స్క్రబ్‌టైఫస్ వైరస్ సోకి హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఐదుగురు చనిపోయారు. ఈ విషయాన్ని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
స్క్రబ్ టైఫస్ వైరస్ ఎలా సోకుతుంది...
స్క్రబ్ టైఫస్.. ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా కారణంగా సోకుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెల్లడించింది. ఇవి కామన్ గా కొండ ప్రాంతల్లో, పొదల్లో ఉండే పేలు లాంటి పురుగులు ద్వారా వస్తాయి.
10 రోజుల తరువాత లక్షణాలు... అప్పటికే..!
ఈ బ్యాక్టిరియా సోకిన పురుగు కుట్టడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని సీడీసీ పేర్కొంది. దీనిలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే పురుగు కుట్టిన పది రోజుల తర్వాత వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. దీని కారణంగా అప్పటికే వైరస్ మొత్తం వ్యాపిస్తుంది. ఇది హెపటిటిస్ కు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ హెమరేజ్, హైపోవోలెమియాకు దారితీయొచ్చు.
స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలు...
ప్రధానంగా జ్వరం, తలనొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులతో పాటు కొంతమందిలో దద్దుర్లు కనిపిస్తాయి. లక్షణాలు బయటపడిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. వీలైనంత త్వరగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.










