Aug 11,2023 22:11

ఢాకా: శ్రీలంకాపాకిస్తాన్‌ వేదికలుగా త్వరలో జరగనున్న ఆసియాకప్‌కు బంగ్లాదేశ్‌ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ాహసన్‌ ఎంపికయ్యాడు. అలాగే భారత్‌ వేదికగా జరిగే ఐసిసి వన్డే ప్రపంచకప్‌కూ అతడే సారథ్యం వహిస్తాడని బంగ్లాదేశ్‌ క్రికెట్‌బోర్డు(బిసిబి) శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో తమీమ్‌ ఇక్బాల్‌ వన్డే కెప్టెన్‌గా తప్పకోవడంతో బంగ్లాదేశ్‌ తర్వాత ఎవరు సారథ్యం వహిస్తారా? అనే ప్రశ్న మొదలైంది. వైస్‌ కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌, యువ సంచలన మెహిదీ హసన్‌ మిరాజ్‌ లలో ఒకరు కెప్టెన్‌ అవుతారనే ఊహలకూ ఫుల్‌స్టాఫ్‌ పడింది. ఈ క్రమంలో సెలెక్టర్లు అనుభవజ్ఞుడైన షకీబ్‌వైపు మొగ్గుచూపారు. 'ఆసియా కప్‌, వన్డే వరల్డ్‌ కప్‌ పోటీల్లో ఆడే బంగ్లా జట్టుకు షకిబ్‌ను కెప్టెన్‌గా సెలెక్ట్‌ చేశాం. ఈ రెండు మెగా టోర్నీల్లో పాల్గనే జట్లను త్వరలో ప్రకటిస్తామని, సెలెక్టర్లు 17మంది ఆటగాళ్లను ఎంపిక చేస్తారని బంగ్లాదేశ్‌ చీఫ్‌ సెలెక్టర్‌ నజ్ముల్‌ హసన్‌ ఓ ప్రకటనలో తెలిపాడు.