Oct 04,2023 11:56

మీడియాపై మోడీ సర్కార్‌ ఉక్కుపాదం
న్యూస్‌క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ సహా ఇద్దరు అరెస్టు
30 ప్రాంతాల్లో న్యూస్‌ పోర్టల్‌ కార్యాలయాలు, జర్నలిస్టుల ఇళ్లపై దాడులు
ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు ఎత్తుకెళ్లిన ఢిల్లీ పోలీసులు
ఎన్‌ఎజె, ఐజెయు, ఐలు తదితర సంఘాల ఖండన
న్యూఢిల్లీ :
కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్వతంత్ర మీడియాపై మరోసారి ఉక్కుపాదం మోపింది. ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌ కార్యాలయంపైన, సిబ్బంది ఇళ్లపైన 30 చోట్ల ఢిల్లీ పోలీసులు మంగళవారం తెల్లవారు జాము నుంచి రాత్రి పొద్దుపోయే దాకా దాడులు నిర్వహించారు. ఉగ్రవాద (నిరోధక) చట్టం యుఎపిఎ కింద న్యూస్‌ క్లిక్‌ ఎడిటర్‌ ప్రబీర్‌ పుర్కాయస్థ, పోర్టల్‌ హెచ్‌ ఆర్‌ విభాగం అధిపతి అమిత్‌ చక్రవర్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. న్యూస్‌ క్లిక్‌ కార్యాలయాన్ని సీల్‌ చేశారు నిజాలను చెప్పే న్యూస్‌క్లిక్‌ పై కత్తిగట్టిన మోడీ సర్కార్‌ ఏమాత్రం పస లేని 'చైనా కుట్ర' థియరీని తెరపైకి తీసుకొచ్చింది. న్యూస్‌క్లిక్‌కు చైనా నుంచి డబ్బు వచ్చిందని, ఆ డబ్బుతో చైనా అనుకూల ప్రచారం చేస్తోందని కేంద్ర హౌం శాఖ ఆరోపిస్తోంది. న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, చరిత్రకారుల నివాసాలపైకి ఢిల్లీ స్మ్పషల్‌ సెల్‌కు చెందిన పోలీసులను పంపి సోదాలు నిర్వహించింది.. న్యూస్‌క్లిక్‌తో సంబంధ మున్న జన్నలిస్టుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్‌ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హార్డ్‌ డిస్క్‌ల డేటా డంప్‌లనూ ఎత్తుకెళ్లారు. నిందితులు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అందించిన ఇన్‌పుట్‌ల ఆధారంగా ఢిల్లీ పోలీసులు దాడులు నిర్వహించారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ దాడులను పలు రాజకీయ పార్టీలు, జర్నలిస్టుల, న్యాయవాదుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. స్వతంత్ర మీడియా గొంతునొక్కేందుకు బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశాయి.

రాత్రి పొద్దుపోయేదాకా  దాడులు
. 'న్యూస్‌క్లిక్‌'కు చెందిన జర్నలిస్టులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, చరిత్రకారుల ఇళ్లపై మంగళవారం రాత్రి బాగా పొద్దుపోయేదాకా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. యుఎపిఎలోని సెక్షన్‌153(ఎ) (మతం,జాతి, జన్మ స్థలం, నివాసం ఆధారంగా విభిన్న ప్రజా సమూహాలమధ్య శత్రుత్వం పెంచడం), ఐపిసి 120 (బి)(నేరపూరిత కుట్ర), కింద ప్రబీర్‌ పుర్కాయస్థ, అమిత్‌ చక్రవర్తి తదితరులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి కేటాయించిన ఇల్లు -నెం.36 క్యానింంగ్‌ లేన్‌లోనూ ఢిల్లీ పోలీసులు సోదాలు చేశారు. జర్నలిస్టులు అభిసర్‌ శర్మ, భాషాసింగ్‌, ఊర్మిళేష్‌, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్‌, రచయిత్రి గీతా హరిహరన్‌, చరిత్రకారుడు సోహైల్‌ హష్మీ, ఢిల్లీ సైన్స్‌ ఫోరమ్‌కు చెందిన డాక్టర్‌ రఘునందన్‌ల ఇళ్లలో ఈ ఉదయం నుంచి సోదాలు జరిగాయి.ముంబయిలో తీస్తా సెతల్వాద్‌ నివాసంలోనూ పోలీసులు సోదాలు జరిపారు. మార్క్సిస్టు పార్టీ కార్యకర్త శ్రీ నారాయణ్‌ కుమారుడు న్యూస్‌క్లిక్‌లో గ్రాఫిక్‌ డిజైనర్‌గా పనిచేస్తుండడంతో ఆ నెపంతో ఢిల్లీ పోలీసులు నెంబర్‌ 36 క్యానింగ్‌ లేన్‌లోని ఆయన ఇంటిపై దాడి చేశారు. అక్కడే ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కార్యాలయం, కిసాన్‌సభ, ఖేత్‌ మజ్దూర్‌, సహమత్‌ కార్యాలయాలతో బాటు పార్టీ, ప్రజా సంఘాల కార్యకర్తలు నివసిస్తున్నారు తన నివాసంలో జరిగిన సోదాలపై ఏచూరి స్పందిస్తూ.. 'న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తున్న నా స్నేహితుల్లో ఒకరైన నారాయణ కుమారుడిని విచారించేందుకు పోలీసులు వచ్చారు. అతడి ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను ఎత్తుకెళ్లారు అని మండిపడ్డారు.

ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ
భారత్‌లో పత్రికా స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని రిపోర్టర్స్‌ వితవుట్‌ బోర్డర్స్‌ ఇప్పటికే వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా మే 3న అది విడుదల చేసిన ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌లో భారత్‌ 11 స్థానాలు దిగజారింది. 2022లో 150కి, 2023లో 161కి చేరింది. మొత్తం 180 దేశాలతో ఈ జాబితాను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం, భారత మీడియా భద్రతాపరమైన సంక్షోభంలో ఉంది. 2014లో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మీడియాలో కార్పొరేట్‌ ఆధిపత్యం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చాలావరకు ప్రధాన వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు మోడీ ప్రభుత్వానికి బాకాలుగా మారాయి. తమ స్వాతంత్య్రాన్ని నిలుపుకుని, అధికారం ముందు నిజాలు మాట్లాడే, ప్రభుత్వాన్ని విమర్శించే కొన్ని మీడియా సంస్థలపై అక్రమ కేసులు బనాయించి అణగదొక్కాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 'దేశ వ్యతిరేక శక్తుల' ఆర్థిక సహాయంతో 'దేశభక్తి' ప్రభుత్వాలను గద్దె దింపేందుకు అంతర్జాతీయ స్థాయిలో పన్నిన కుట్రలో భాగంగా' పనిచేస్తున్నాయని తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే చాలా మంది జర్నలిస్టులు, టెలివిజన్‌ ప్రెజెంటర్లు, యూట్యూబ్‌లో పబ్లిక్‌ ఎడ్యుకేషనల్‌ వీడియోలను పెట్టే వారు పోలీసుల వేధింపులకు గురవుతున్నారు. నిఘా అనేది చాలా సాధారణ ప్రక్రియగా మారిపోయింది. సంఫ్‌ు పరివార్‌లోని వివిధ తీవ్రవాద గ్రూపులు కొంతమందిని చంపాలని, నిందితులను ఉరితీయాలని నేరుగా డిమాండ్‌ చేశాయి. ఈ జాబితాలో జర్నలిస్ట్‌ రానా అయూబ్‌, న్యూస్‌ ఏజెన్సీ 'ఆల్ట్‌ న్యూస్‌' హెడ్‌ మహ్మద్‌ జుబేర్‌, స్వతంత్ర పాత్రికేయుడు ఫయే డిసౌజా, బర్ఖాదత్‌లాంటివారు ఉన్నారు.

సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో
క్రూరమైన యుఎపిఎ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా పలువురు జర్నలిస్టులు, స్టాండ్‌-అప్‌ కమెడియన్లు, శాస్త్రవేత్తలు, సాంస్కతిక చరిత్రకారులు, విమర్శకుల ఇళ్లపై ఢిల్లీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున దాడులు చేయడాన్ని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించింది. పార్టీ పొలిట్‌బ్యూరో మంగళవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలజేసింది. న్యూస్‌క్లిక్‌పై జరిగిన దాడిని మీడియాపైన, ప్రాథమిక హక్కు అయిన భావప్రకటనా స్వేచ్ఛపైన జరిగిన క్రూరమైన దాడిగా పొలిట్‌బ్యూరో అభివర్ణించింది. మోదీ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లుగా బిబిసి, న్యూస్‌ లాండ్రీ, దైనిక్‌ భాస్కర్‌, భారత్‌ సమాచార్‌, కశ్మీర్‌ వాలా, వైర్‌ వంటి వివిధ మీడియా సంస్థలను అణచివేయడానికి, వేధించడానికి, బెదిరించడానికి దర్యాప్తు సంస్థలను సాధనాలుగా చేసుకుంటున్నది. ఇప్పుడు న్యూస్‌ క్లిక్‌తో సంబంధమున్నవారిపై దాడులు చేయిస్తోంది. నిజాలు చెప్పే జర్నలిస్టులపై నిరంకుశంగా దాడులు చేయడం ఎంతమాత్రం సహించరానిదని పేర్కొంది. మీడియాను హింసించి, అణచివేసేందుకు వ్యవస్థీకత కుట్ర జరుగుతోందని, దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే దేశభక్తులంతా ఏకతాటిపైకి రావాలని పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.



ప్రెస్‌క్లబ్‌ ఆఫ్‌ ఇండియా ఖండన
న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, రచయితల ఇళ్లపై దాడులను ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా తీవ్రంగా ఖండించింది. మోడీ హయాంలో ప్రజాస్వామ్య మూలస్తంభాలన్నీ దాడికి గురవుతున్నాయని, ఇప్పుడు పత్రికా స్వేచ్ఛకు కూడా ముప్పు వాటిల్లుతోందని పేర్కొంది..

ఐలు ఖండన
జర్నలిస్టులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, చరిత్రకారుల నివాసాలపై దాడులు చేసిన ఢిల్లీ పోలీసుల చర్యను ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ ఖండించింది. దర్యాప్తు సంస్థలను సాధనాలుగా చేసుకుని అసమ్మతిని, భిన్నాభిప్రాయాలను అణిచివేసేందుకు మోడీ ప్రభుత్వం పన్నిన పన్నాగంలో భాగంగానే ఈ దాడులను చూడాలిని ఐలు కోరింది. జరుగుతున్నాయి.ఈ అప్రజాస్వామిక చర్యకు వ్యతిరేకంగా న్యాయవాదులు ముందుకు రావాలని లాయర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది.
 

ఐద్వా ఖండన
ఢిల్లీ, ముంబయిల్లో జర్నలిస్టులు, రచయితలు, మానవ హక్కుల కార్యకర్తల నివాసాలపై జరిగిన దాడులను ఐద్వా తీవ్రంగా ఖండించింది. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే, స్వతంత్రులైన జర్నలిస్టులను అడ్డగించడం కోసమే అత్యంత అప్రజాస్వామికమైన, అసమర్ధనీయమైన రీతిలో దాడులు జరుపుతున్నారని విమర్శించింది. ఈనాటి దాడులకు లక్ష్యంగా మారిన వారందరికీ ఐద్వా సంఘీభావాన్ని ప్రకటించింది. ఈ ఫాసిస్ట్‌ ప్రభుత్వం అనుసరించే అక్రమ, అణచివేత చర్యలను ఖండించడానికి ప్రజాస్వామ్య పౌరులందరూ ముందుకు రావాలని ఐద్వా విజ్ఞప్తి చేసింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది.