ప్రజాశక్తి-పత్తికొండ(కర్నూలు) : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనసభలో జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ పెట్టిన బిల్లు ఆమోదం పొందడం ద్వారానే సెప్టెంబర్ 27 ఉద్యోగ ఉపాధ్యాయులకు ఒక చీకటి రోజున మిగిలిపోయిందని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి భాస్కర్ పేర్కొన్నారు. గురువారం పత్తికొండ పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి భాస్కర్ పాల్గొని మాట్లాడారు. ఆనాటి ఉద్యోగ ఉపాధ్యాయుల లోకం ప్రభుత్వంపై అనేక పోరాటాలు త్యాగాలు చేసిన ఫలితంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ లభించిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగ వర్గానికి చేసిన నమ్మకద్రోహంగా ఉందని తెలిపారు దేశంలో అనేక రాష్ట్రాలు పాత పెన్షన్ వైపు నిర్ణయం ప్రకటిస్తుంటే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా మొండిగా జిపిఎస్ అనే మోసపూరిత విధానాన్ని ఉద్యోగులపై బలవంతంగా అమలకు పూనుకుందని అన్నారు ఈ మోసానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేయవలసిన అవసరం ఉందని , ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. గ్యారెంటీ లేని పింఛన్ స్కీంకు గ్యారెంటీ పెన్షన్ అని పెట్టడమే కాక ఈ పథకం దేశానికే ఆదర్శం అవుతుందని చెప్పడం సిగ్గుచేటు అని విమర్శించారు భవిష్యత్ జిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని లేనిచో ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షులు కార్యదర్శులు రంగస్వామి వీరేషు వెంకటేశ్వర్ రెడ్డి శేఖర్ ఈశ్వర్ ప్రసాద్ బాబు సత్యనారాయణ రామమౌళి ఆదిశేషిరెడ్డి రవి నాగభూషణ్ తదితరులు పాల్గొన్నారు.










