Jul 25,2023 21:40
  • కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌

న్యూఢిల్లీ: భారత స్టార్‌ షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ సాధించారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య(బిడబ్ల్యుఎఫ్‌) తాజా ర్యాంకింగ్స్‌లో వీరు ఏకంగా 2వ స్థానానికి ఎగబాకారు. ఈ ఏడాది మూడో వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ గెలిచిన ఈ జంటకు కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ ఇదే కావడం విశేషం. ఇటీవల ముగిసిన కొరియా ఓపెన్‌లో టైటిల్‌ విజేతగా నిలవడంతో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ర్యాంక్‌ మెరుగుపడింది. ఇండోనేషియా ఓపెన్‌ ట్రోఫీ తర్వాత సాత్విక్‌-చిరాగ్‌ మూడో ర్యాంక్‌కు ఎగబాకారు. ఫైనల్లో టాప్‌ సీడ్‌ ఓడీకి షాకిచ్చి చాంపియన్‌గా నిలిచారు. చైనాకు చెందిన లియాంగ్‌ వే కెంగ్‌, వాంగ్‌ చాంగ్‌ జంటను చిత్తు చేసి సగర్వంగా ట్రోఫీ అందుకున్నారు. దాంతో ఒక ర్యాంక్‌ మెరుగుపరుచుకున్నారు.

  • వరల్డ్‌ టూర్‌ ఫైనల్లో రికార్డు

ఈ ఏడాది ఆరంభం నుంచి సాత్విక్‌-చిరాగ్‌ జంట దుమ్మురేపుతోంది. వరుస ట్రోఫీల్లో సంచలన విజయాలతో దూసుకెళ్తోంది. ఈ ఏడాది తొలిసారి స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీకి వరల్డ్‌ టూర్‌ ఫైనల్లో అద్భుతమైన రికార్డు కలిగి ఉన్నారు. ఇప్పటివరకూ తొమ్మిదిసార్లు ఫైనల్‌ చేరిన ఈ జోడీ ఏకంగా ఏడు పర్యాయాలు చాంపియన్‌గా నిలిచింది. అంతేకాదు వీళ్లిద్దరూ తొలిసారిగా ఇండోనేషియా సూపర్‌ 1000 టోర్నమెంట్‌ టైటిల్‌ సాధించారు. దాంతో, ఇండోనేషియా ఓపెన్‌ టైటిల్‌ అందుకున్న తొలి భారత డబుల్స్‌ జోడీగా రికార్డు నెలకొల్పారు.