Sep 03,2023 09:05

బిడ్డకు తొలి గురువు తల్లి. ఆమె ఒడిలో అక్షరాలు దిద్ది.. ఊహ తెలిసాక బడి బాట పడతారు పిల్లలు. అక్కడ కనిపించే గురువే తనకు మార్గదర్శి. పిల్లలు తొలినాళ్లలో ఆ ఉపాధ్యాయుల్లో తల్లిని, తండ్రిని వెతుక్కుంటారు. కొన్ని సందర్భాల్లో గురువు - విద్యార్థి మంచిమిత్రులు అవుతారు. అటువంటి అనుబంధం.. వారి భవిష్యత్తు అభివృద్ధి చెందేందుకు పునాది అవుతుంది. గురువు నేర్పిన పాఠాలు, చెప్పిన అనుభవాలు, మాటలతో పిల్లలు ప్రభావితులవుతారు. ఆ ఉపాధ్యాయులకే ఉపాధ్యాయులైన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కృషికి ఆయన పుట్టిన తేదీని 'ఉపాధ్యాయ దినోత్సవం'గా జరుపుకుంటున్నాం. ప్రపంచం అభివృద్ధి సాధిస్తోందంటే, విద్య.. విజ్ఞానమే ప్రధాన కారణం. ఆ రంగంలో కీలకపాత్ర ఉపాధ్యాయులదే. ఎందరినో ఉన్నత శిఖరాలకు చేర్చిన గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా... శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రత్యేక కథనం...

11

                                                                 ఈరోజు ఎలా వచ్చిందంటే..?

మనదేశ మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌. ఆయన సెప్టెంబర్‌ 5, 1888న జన్మించారు. ఆయన జయంతిని పురస్కరించుకుని, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. రాధాకృష్ణన్‌ ఒక తత్వవేత్త, పండితులు, రాజకీయవేత్త, ఉపాధ్యాయులు. ఆయన గురువుగా తన వృత్తిని ప్రారంభించారు. విద్యార్థులకు విద్యను అందించడానికి తన జీవితమంతా పనిచేశారు. ఆయన భారతరత్న అవార్డు గ్రహీత. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, విదేశీ రాయబారిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ప్రపంచాన్ని ప్రభావితం చేసిన మహా మహోపాధ్యాయులు మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌.

           ఓ వ్యక్తి అక్షర జ్ఞానం మొదలయ్యేది బడిలోనే. అక్కడ అ, ఆ ల నుంచి గుణింతాల వరకు, అంకెల నుంచి లెక్కల వరకు, శాస్త్ర పరిజ్ఞానం నుంచి చరిత్ర వరకు, ఆటలైనా, పాటలైనా దగ్గరుండి నేర్పించేది ఉపాధ్యాయులే. తల్లిదండ్రుల తర్వాత పిల్లలు ఎక్కువగా ఇష్టపడేది ఉపాధ్యాయులనే. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే.. సమాజాభివృద్ధి కూడా అంతే దృఢంగా ఉంటుంది. కానీ విద్యారంగంలో వస్తున్న నూతన విధానాల వల్ల కాలక్రమేణా ఆ అనుబంధం పలుచబడుతోంది. ఓ ఇల్లు కట్టాలంటే పునాది ఎంత ముఖ్యమో.. సమాజం అభివృద్ధి చెందాలంటే యువతకు విజ్ఞానం అంతే అవసరం. అటువంటి జ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయులు ప్రస్తుతం అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు. అది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపుతోంది.
           విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువుతో పాటు క్రమశిక్షణ, విచక్షణ, నిబద్ధత, సమయపాలన అలవరుస్తారు. దారి తప్పుతున్న పిల్లలను సక్రమమైన మార్గంలో నడిచేలా చేస్తారు. భవిష్యత్తు మీద ఆశలు కల్పిస్తారు. లక్ష్యసాధనకు బాటలు వేస్తారు. అటువంటి ఉపాధ్యాయులు క్లాసుకు వస్తున్నారంటే పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉంటారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ తరగతిలో పాఠం చెబుతుంటే, మిగిలిన తరగతుల విద్యార్థులు ఆ గది చుట్టూ నిలబడి, వినేవారట. ఆయన బోధనా శైలి పిల్లల్ని అంతలా ఆకట్టుకునేది మరి.

55

                                                                         గురు-శిష్యుల అనుబంధం

గురువులు శిష్యులకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. కానీ కార్పొరేట్‌ విద్యాలయాల్లో తీరు మారుతోంది. యాజమాన్యాలు ఫీజుల విషయంలో పిల్లలపై ఉపాధ్యాయుల చేత ఒత్తిడి తెస్తున్నాయి. అదనంగా క్లాసులు చెప్పించి, యంత్రాల్లా తయారుచేస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు-ఉపాధ్యాయులకు మధ్య ఉండాల్సిన ఆరోగ్యకరమైన అనుబంధం కొరవడుతోంది. దాంతో విద్యార్థులు.. టీచర్లను వేధించే వ్యక్తులుగా చూడటం మొదలయ్యింది. స్కూళ్ళలో ఇలాంటి వాతావరణం ఉంటే అప్పుడే లోకాన్ని చూస్తున్న పిల్లలపై ప్రమాదకరమైన ప్రభావం పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
             ఫీజుల వసూళ్లే ప్రధానంగా, ర్యాంకులే ప్రాముఖ్యంగా నడుపుతున్న స్కూళ్లల్లో.. పిల్లల సంఖ్య పెరిగిందా? లేదా? అనేదే చూస్తారు. కానీ ఆ పిల్లలు సక్రమమైన మార్గంలో నడుస్తున్నారా? మానసికంగా అభివృద్ధి సాధిస్తున్నారా? లేదా? అనేది వారికి పట్టదు. యువత పట్టుదలతో ఏదైనా నేర్చుకోవాలన్నా.. గురువు బోధన, ప్రోత్సాహం తప్పనిసరి. అలాంటి గురువులను సినిమాల ప్రభావంతో తరగతిగదిలో పిల్లలు అల్లరిపెట్టడం జరుగుతోంది. అది ఈ తరం పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ తీరు మారాలి. స్కూలు యాజమాన్యాలు ఇలాంటి వాటిని మొదట్లోనే గుర్తించి, పిల్లలకు తగిన కౌన్సెలింగ్‌ ఇవ్వాలి. అప్పుడే మంచి తరం తయారవుతుంది.
           పిల్లల్లో సత్ప్రవర్తన, మంచి నడవడిక అలవడాలంటే ఉపాధ్యాయులే ప్రధాన పాత్రధారులు. పిల్లలు ఎక్కువగా ఉపాధ్యాయులను అనుకరిస్తారు. కొత్తగా చెప్పిన పాఠాలను ఇంటికి వచ్చి, పిల్లలు తల్లిదండ్రులకు అబ్బురంగా చెబుతుంటారు. ఆ రోజు క్లాసులో జరిగిన విశేషాలను, తమ అనుభూతులను తల్లిదండ్రులు, స్నేహితులతో పంచుకుంటారు. తామూ స్ఫూర్తిగా తీసుకొని, బోధనా వృత్తిని చేపట్టాలనుకుంటారు. బాల్యం నుంచే మంచి, చెడులు అర్థమవుతాయి. ఆ దశలో పిల్లలకు ఉపాధ్యాయులే ఆదర్శం. పుస్తకాల్లో ఉన్న పాఠాలు మాత్రమే కాదు.. సమాజంలోని సవాళ్లు, సమస్యలను ఎదుర్కోవడం, జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవడం ఎలాగో నేర్పించే బాధ్యత తల్లిదండ్రులతో పాటు టీచర్లపైనా ఎక్కువగా ఉంటుంది. బడిలో అనుకూలమైన, ఆరోగ్యవంతమైన, ఇష్టపూర్వకమైన వాతావరణాన్ని కల్పించాలి.

66


                                                                         ఆన్‌లైన్‌ క్లాసుల ప్రభావం

కోవిడ్‌ ప్రభావంతో ఆన్‌లైన్‌ క్లాసుల ఆరంభమైనా.. ఇప్పటికీ ఈ సాంకేతికతను అవసరమైనప్పుడు వాడుతున్నారు. ఈ ఆన్‌లైన్‌ విద్య వల్ల పిల్లలకు, ఉపాధ్యాయులకు మధ్య దూరం పెరుగుతుందని కొందరి భావన. ఆన్‌లైన్లో క్లాసు వింటున్న పిల్లవాడి మానసిక పరిస్థితి ఎలా ఉంది? అసలు క్లాసు వింటున్నారా? లేదా? అనేది గమనించేందుకు సాధ్యపడదు. అంతేకాదు.. చెబుతున్న పాఠాల్లో అనుమానాలు వచ్చినా అడిగేందుకు పిల్లలు వెనకాడ వచ్చు. అదే ఉపాధ్యాయుల సమక్షంలో అయితే విద్యార్థి తన అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు వీలు ఉంటుంది. దాంతో విద్యార్థులకు, టీచర్ల పట్ల సానుకూల అభిప్రాయం, పరస్పర అవగాహన ఏర్పడుతుంది.
 

                                                                       కుటుంబం అనే అనుభూతి..

చాలామంది పిల్లలు హాస్టల్స్‌లో ఉండి, చదువుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో కుటుంబంతో కన్నా ఉపాధ్యాయులతోనే ఎక్కువ అనుబంధం ఏర్పడుతుంది. ఎప్పుడైనా ఇంటి మీద బెంగగా ఉంటే క్లాస్‌ టీచర్‌ని, లేదా ఉపాధ్యాయులని అమ్మా, నాన్నలుగా అనుభూతి చెంది, మానసికంగా దగ్గరవుతారు. వాళ్ళు కూడా విద్యార్థులను బిడ్డలా్లగ ప్రేమగా ఉండటం, ఆరోగ్యం బాగోలేనప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అప్పుడు ఉపాధ్యాయులు అనే భావన కన్నా, 'నా కుటుంబం' అనే భావనే విద్యార్థులకు మానసికంగా కలుగుతుంది. అప్పుడు ఆయా విద్యార్థులు ఉన్నత విద్యాభివృద్ధికి, ఏదైనా ముఖ్యమైన సంఘటన జరిగినప్పుడు, సాధించినప్పుడు, లేదా సలహాలు కావాలంటే వాళ్లనే సంప్రదిస్తారు. అందుకే ఉపాధ్యాయులు తమ విద్యార్థుల పట్ల ఆప్యాయతానురాగాలు చూపాలి. అలాంటి ఉపాధ్యాయులను విద్యార్థులు జీవితంలో మర్చిపోలేరు. ఒకచోట చదివిన పూర్వ విద్యార్థులంతా సమ్మేళనమై ఉపాధ్యాయులను సన్మానిస్తున్నారు. పూజిస్తున్నారు. ఆత్మీయంగా కలుసుకుని, బాల్యంలో జరిగిన స్మృతులను నెమరేసుకుంటున్నారు. ఆర్థికంగా చితికిపోయిన ఉపాధ్యాయులకు సహాయపడుతున్నారు. తమ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇది ఎక్కువగా ప్రభుత్వ అటానమస్‌ విద్యాసంస్థల్లోనే జరుగుతోంది. కార్పొరేటు విద్యాసంస్థల్లో ఇలాంటి అనుబంధ ఆనందోత్సవాలను చూడలేం.
         కానీ ఇప్పుడు నూతన ఆర్థిక విధానాల ప్రభావంతో విద్యారంగంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాస్తవాలు చెప్పే చరిత్రను, సైన్సు పాఠాలను తొలగిస్తున్నారు. మనువాదాన్ని ముందుకు తెస్తున్నారు. మత భేదాలను బడి స్థాయిలోనే పిల్లల్లో కలిగించేలా చేస్తున్నారు. ఇవన్నీ మన దేశ సమైక్యతకు, సమగ్రతకు విఘాతం కలిగించేవి. ఇలాంటివి ఉపాధ్యాయులు సరిదిద్దాల్సిందిపోయి, వారే అందుకు ఆద్యులు కావడం ప్రమాదకరం. యువతకు, భావితరాలకు ఏది నిజం, ఏది అబద్ధమో చెప్పాల్సిన ఆవశ్యకత ఉపాధ్యాయులపైనే ఉంది.
పద్మావతి
94905 59477