Oct 25,2023 21:52

ప్రజాశక్తి - ఎఎన్‌యు (గుంటూరు జిల్లా) : నవ తెలంగాణ దినపత్రిక జర్నలిస్టు షేక్‌ సలీమకు ఆచార్య నాగార్జున యూనివర్శిటి పిహెచ్‌డిని ప్రదానం చేసింది. యూనివర్శిటీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చల్లపల్లి స్వరూపరాణి డాక్టరేట్‌ పట్టాను సలీమకు అందచేశారు. పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో 'భారత స్వాతంత్య్ర ఉద్యమంలో మహిళల పాత్ర' అనే అంశంపై పరిశోధన చేసి సమర్పించిన పత్రానికి గానూ సలీమకు పిహెచ్‌డిని ప్రదానం చేసినట్లు రీసెర్చ్‌ సెల్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ పి.కిరణ్మయి ఈ సందర్భంగా తెలిపారు. పరిశోధన సమయంలో రీసెర్చ్‌ డైరెక్టర్‌గా ఎం.రవిశేఖర్‌ వ్యవహరించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోనే పొలిటికల్‌ సైన్స్‌ విభాగంలో పిజి చేసిన సలీమ నాలుగు బంగారు పతకాలను సాధించారు. గతంలో సలీమ ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ గర్ల్స్‌ కన్వీనర్‌గా, ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులుగానూ పని చేశారు. పిజి అనంతరం కొంతకాలం న్రజాశక్తిలో పనిచేశారు. ప్రస్తుతం నవ తెలంగాణ దినపత్రికలో ఫీచర్స్‌ డెస్క్‌ బాధ్యతలు చూస్తున్నారు. తెలంగాణ సాహితీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టు ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. నవ తెలంగాణ సలీమకు డాక్టరేట్‌ రావడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.