- ఆరుతడి పంటలు వేసుకోండి
- జలవనరుల, వ్యవసాయ శాఖ అధికారుల ప్రచారం
- వేసిన పంటలు కాపాడుకోవడానికి రైతులకు ప్రయాస
ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ ఏడాది వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుంది. ప్రధానంగా నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో సేద్యానికి నీరు ఇవ్వలేమని జలవనరుల శాఖ ఒంగోలు ఎస్‌ఇ ప్రకటించారు. కేవలర వర్షాధార పంటలు మాత్రమే వేసుకోవాలని బాపట్ల జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తెలియజేశారు. ఈ మేరకు మీడియాలో ప్రచారం చేశారు. దీంతో, రైతుల్లో ఆందోళన నెలకొంది. సాగర్ ఆయకట్టు పరిధిలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో కుడి కాలువ కింద 11 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో రెండు లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా. ప్రకాశం జిల్లాలో 38 వేల ఎకరాలు, పల్నాడు జిల్లాలో 1.22 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా వేశారు. ఇప్పటి వరకూ ఈ రెండు జిల్లాల్లో కేవలం 8 వేల ఎకరాల్లోనే వరిని వేశారు.
గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా కుడి కాలువ కింద కొంత ఆయకట్టు ఉంది. కాలువలకు నీరు వచ్చే అవకాశాన్ని బట్టి 40 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. సాగర్ జలాశయంలో గరిష్ట నీటి నిల్వలో సగం కూడా లేకపోవడంతో వరి సాగుకు అనుమతి ఇవ్వరాదని జలవనరుల శాఖ నిర్ణయించింది. ఎగువ నుంచి నీటి ప్రవాహం రాకపోవడంతో సాగర్ జలాశయంలో గత రెండు నెలల్లో నిల్వ పెరగడం లేదు. దీంతో, డెడ్ స్టోరేజీ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉండడంతో తాగునీటికి మాత్రమే నీరు ఇస్తామని, వ్యవసాయానికి ఇవ్వలేమని అధికారులు ప్రకటించారు. గత నాలుగేళ్లుగా ఇదే సమయానికి కృష్ణా పరివాహక ప్రాంతంలోని అన్ని జలాశయాల్లో నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ ఏడాది మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మరోవైపు సాగర్ ఆయకట్టు పరిధిలో 30 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, పత్తి, మిర్చి తదితర పంటల సాగు కూడా ప్రశ్నార్థకమైంది. ఇప్పటికే వేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలుపడుతున్నారు. పల్నాడు జిల్లాలో 1.22 లక్షల ఎకరాలకుగాను కేవలం 4,900 ఎకరాల్లో, ప్రకాశం జిల్లాలో 37 వేల ఎకరాలకుగాను కేవలం 3,100 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు వేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 4.80 లక్షల ఎకరాలకుగాను 1.78 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. వేసిన పంటలు బెట్టకు రావడంతో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాశం జిల్లాలో 85 వేల ఎకరాలకుగాను 31 వేల ఎకరాల్లో పత్తి వేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో మిర్చి సాగవుతుందని అంచనా. ఈ ఏడాది ఇప్పటి వరకు 15 వేల ఎకరాల్లోనే సాగు ప్రారంభించారు. సాగర్ జలాశయంలో నీరు లేకపోవడంతో పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈ ఏడాది మిర్చి సాగు ఇంతవరకు ఊపందుకోలేదు. మిర్చికి తప్పనిసరిగా రెండుమూడు తడులకు నీటి అవసరం ఉంది. సాగర్ నుంచి నీరు రాకపోతే మిర్చి దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. దీంతో, రైతులు మిర్చి సాగుకు ధైర్యంగా ముందుకు వెళ్లలేకపోతున్నారు. సెప్టెంబరు వచ్చినా వర్షాలు కూడా నిరాశాజనకంగా ఉండడంతో వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి నిల్వ 215.80 టిఎంసిలు కాగా, శుక్రవారం నాటికి 84.66 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 215.81 టిఎంసిల నీరు నిల్వ ఉంది. సాగర్ జలాశయ గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312.04 టిఎంసిలు. ప్రస్తుతం 154.99 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజుకు 310.85 టిఎంసిల నీరు నిల్వ ఉంది.










