ముంబై : క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముంబై క్రికెట్ ఆసోషియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే మంగళవారం ప్రకటించారు. చారిత్రక వాంఖడే స్టేడియంలో ఒక ఆటగాడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఇది తొలిసారి అని కాలే తన ప్రకటనలో తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023 మెగా టోర్నీ సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని వెల్లడించారు. ఈ విషయాలను అమోల్ కాలే మీడియాకు వెల్లడించినప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఆయన పక్కనే ఉన్నాడు. ఈ సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడుతూ వాంఖడే స్టేడియం తనకు ఎంతో ప్రత్యేకం అని, తన తొలి రంజీ మ్యాచ్, ఆఖరి ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ఇదే వేదికపై ఆడానని తెలిపాడు. ఇప్పుడు నేను పాతికేళ్ల అనుభవంతో 25 ఏళ్ల యువకుడిగా ఉన్నా. ఇలాంటి గొప్ప గౌరవం అందించిన ఎంసీఏకి ధన్యవాదాలు. నాకు ఇదొక ప్రత్యేక ప్రదేశం'' అని సచిన్ ఆనందం వ్యక్తం చేశాడు.










