ప్రజాశక్తి-ఆత్మకూరు(అనంతపురం) : ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం బెంగుళూరు నుండీ క్షేమంగా ఆత్మకూరుకు చేరుకున్న ఏ.ఆర్ కానిస్టేబుల్ భార్యను, ఇతర కుటుంబ సభ్యులను ఎస్‌పి కె.శ్రీనివాసరావు పరామర్శిచారు. సోములదొడ్డి సమీపంలోని జాతీయ రహదారి- 44 పై ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ కుమార్, ఈయన భార్య అనిత తీవ్రంగా గాయపడ్డారు. వీరిని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగుళూరుకు తీసికెళ్తుండగా మార్గం మధ్యలో కిరణ్ కుమార్ చనిపోయారు. అనితను బెంగుళూరు ఆస్టర్ సి.ఎం.ఐ ఆసుపత్రిలో చికిత్సకు చేర్పించారు. ఆమె చికిత్సకు అవసరమైన డబ్బును పోలీసులు, ప్రజలు మానవత్వంతో అందించి ఆదుకున్నారు. ఈనేపథ్యంలో కోలుకున్న ఆమె ఆసుపత్రి నుండీ డిశ్చార్జి అయ్యి ఆత్మకూరు చేరుకున్నారు. దీంతో ఎస్‌పి ఆత్మకూరులోని అనిత స్వగహానికెళ్లి యోగ క్షేమాలపై అడిగి తెలుసుకున్నారు. కుటుంబ పెద్ద దిక్కు లేరని బాధపడకండి.. పోలీసుశాఖ అండగా ఉంటుంది. ధైర్యంగా జీవించాలని ఎస్పీ గారు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ మునిరాజ్, సిఐ నరేంద్రరెడ్డి, ఆర్‌ఐ రాముడు, ఆర్ ఎస్‌ఐ రాజశేఖర్ రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోక్‌నాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్ , తేజ్ పాల్, మసూద్ వలీ, తదితరులు పాల్గొన్నారు.










