- న్యూస్‌క్లిక్ జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్ అందులో భాగమే
ప్రజాశక్తి -న్యూఢిల్లీ బ్యూరో : న్యూస్‌క్లిక్ జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ద్వారా రైతుల ఉద్యమంపై బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలోని మోడీ ప్రభుత్వ చేస్తున్న దాడికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారీ ఆందోళనలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీలో చారిత్రాత్మక రైతు ఉద్యమంపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న దుర్మార్గపు ఆరోపణల గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురైనట్లు ఎస్‌కెఎం పేర్కొంది. న్యూస్‌క్లిక్, జర్నలిస్టులపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో రైతుల ఉద్యమంపై చేసిన ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నట్లు తెలిపింది. 'దేశ ప్రజలకు అవసరమైన సరఫరాలకు అంతరాయం కలిగించడం, అత్యవసర సేవలకు అంతరాయం కలిగించడం, ఆస్తులకు నష్టం కలిగించడం, విధ్వంసం సృష్టించడం, భారత ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం కలిగించడం, అక్రమంగా విదేశీ నిధులను స్వీకరించడం ద్వారా అంతర్గత శాంతిభద్రతల సమస్యలను సృష్టించడం' రైతుల ఉద్యమం చేసిందంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలన్నీ అబద్ధాలనీ, ప్రేరేపితమైనవని పేర్కొంది.
''బిజెపి ప్రభుత్వ రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల చట్టాలు, విధానాలకు వ్యతిరేకంగా ఎస్‌కెఎం నేతృత్వంలోని రైతులు, దేశంలోని అన్నదాతలు శాంతియుత నిరసనలో పాల్గొన్నారు. రైతులకు సరఫరాకు అంతరాయం కలగలేదు. రైతుల వల్ల ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. ముండ్ల కంచెలు, నీటి ఫిరంగులు, లాఠీ చార్జీలు, రోడ్లపై కందకాలు తవ్వడం వంటివాటితో దేశ రాజధానికి చేరుకునే వారు ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోకుండా కేంద్ర ప్రభుత్వం రైతులను హింసాత్మకంగా ఆపింది. అది దేశ ప్రజలకు, రైతులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది.
మండుతున్న వేసవి ఎండలు, కుండపోత వర్షాలు, గడ్డకట్టే చలితో రైతులు 13 నెలల పాటు నిరసనలో కూర్చోవలసి వచ్చింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వం శాంతి భద్రతల సమస్యలను సృష్టించింది. లఖింపూర్ ఖేరీ వద్ద ర్యాలీ చేస్తున్న రైతులను వాహనాలతో తొక్కించి, నలుగురు రైతులు, ఒక జర్నలిస్టును చంపారు. ఈ దాడి వెనుక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆయన కుమారుడి హస్తం ఉంది. ఇప్పటి వరకు ఆ మంత్రిని ప్రధానమంత్రి తొలగించలేదు. మోడీ ప్రభుత్వ అణచివేతను ఎదుర్కోవడానికి లఖింపూర్ ఖేరీ రైతులతో సహా 735 మంది రైతులు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సి వచ్చింది'' అని పేర్కొంది.
న్యూస్‌క్లిక్ ఎఫ్‌ఐఆర్‌లో రైతుల ఉద్యమంపై చేసిన తప్పుడు, దుర్మార్గపు ఆరోపణలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతి రాష్ట్ర రాజధాని, జిల్లా కేంద్రం, మండల కేంద్రంలో పెద్దఎత్తున నిరసనలు చేపట్టాలని ఎస్‌కెఎం పిలుపునిచ్చింది. రైతుల ఉద్యమంపై చేసిన అన్ని ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎస్‌కెఎం నాయకుల ప్రతినిధి బృందాలు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కి వినతులు సమర్పిస్తాయని పేర్కొంది.










