ప్రజాశక్తి-ఎర్రగుంట్ల (కడప జిల్లా):వివేకానందరెడ్డి హత్య కేసులో అఫ్రూవర్‌గా మారిన దస్తగిరిని అరెస్టు చేసినట్లు జమ్మలమడుగు డిఎస్‌పి నాగరాజు తెలిపారు. కడప జిల్లా ఎర్రగుంట్ల పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. పట్టణ పరిధిలోని సుందరయ్య నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ అనే యువకుడి ఫిర్యాదు మేరకు దస్తగిరిపై ఎస్‌సి, ఎస్‌టి, కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఎస్‌సి కులానికి చెందిన లక్ష్మీనారాయణ, దూదేకుల కులానికి చెందిన ఇమాంబి డిగ్రీలో ప్రేమించుకున్నారని తెలిపారు. ఇమాంబి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె లక్ష్మీనారాయణతో సహజీవనం చేస్తున్నట్లు చెప్పారు. దస్తగిరికి ఇమాంబి బంధువులు కావడంతో లక్ష్మీనారాయణ కులం పేరుతో దూషించి, బెదిరించి ఇమాంబిని పలువురు సహాయంతో బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడని తెలిపారు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు ఎర్రగుంట్ల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా కడప శివారులో పట్టుపడడంతో సిఐ ఈశ్వరయ్య పోలీసుస్టేషన్‌కు తరలించారన్నారు. దస్తగిరితో పాటు ఇమ్రాన్‌బాషా, రమీజా, అశ్రిన్, హైదర్‌బిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు.
- నా భర్తను అక్రమంగా అరెస్టు చేశారు
తన భర్త దస్తగిరిపై అక్రమంగా కేసు బనాయించి అరెస్టు చేశారంటూ ఆయన భార్య షబానా ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం చూడ్డానికి కూడా లోపలికి పంపడంలేదని, డబ్బుల కోసం, ఆస్తుల కోసమో కిడ్నాప్ చేయలేదని తమ బంధువుల పాప వేరొక కులం వారిని ప్రేమించడంతో మందలించి తీసుకువచ్చారే తప్ప ఏ తప్పు చేయలేదని తెలిపారు. తన భర్తను చూపించాలంటూ పోలీసుస్టేషన్ ముందు బైఠాయించడంతో పోలీసులు అనుమతిని ఇచ్చారు. తన భర్తకు ఎటువంటి హాని జరిగినా తమ కుటుంబానికి సిఎం జగన్ మోహన్‌రెడ్డి సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు.










