నయా ఉదారవాద విధానాలే కారణం
జాతీయ సెమినార్‌లో వక్తల విమర్శ
తిరువనంతపురం : నయా ఉదారవాద విధానాల అమలు కారణంగా దేశంలో రబ్బరు పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని తిరువనంతపురంలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ సెమినార్ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల కారణంగా చౌకబారు సింథటిక్ రబ్బరు దేశంలోకి పెద్ద ఎత్తున దిగుమతి అయిందని, దీంతో చిన్నకారు రైతులు నష్టాలలో కూరుకుపోయారని, గత మూడు దశాబ్దాలుగా ధరలు పడిపోయాయని తెలిపింది. పుచ్చలపల్లి సుందరయ్య స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమినార్‌కు రైతులు, కార్మికులు, వ్యాపారులు, రైతు నేతలు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు హాజరయ్యారు. రబ్బరు పరిశ్రమపై దేశంలో సవివరమైన చర్చ జరగడం ఇదే మొదటిసారి.
ఈ సమావేశంలో రబ్బరు పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. పంట దిగుబడి తగ్గడం, చెట్లు పక్వానికి రావడంలో ఆలస్యం జరగడం, కార్పొరేట్ సంస్థల పెత్తనం, టైర్ల కంపెనీలు కుమ్మక్కై ధరలు తగ్గించడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. రబ్బరు పరిశ్రమను కార్పొరేటీకరించడం మానుకొని సహకారం దిశగా ముందుకు తీసికెళ్లాలని, దీనివల్ల ఉత్పత్తిదారులు, వినియోగదారులు లబ్ది పొందుతారని సెమినార్ సూచించింది.
రబ్బరు ధరలు పడిపోతున్నప్పటికీ కనీస మద్దతు ధరను నిర్ణయించేందుకు కేంద్రం నిరాకరిస్తోంది. వాణిజ్య ఒప్పందాలను సాకుగా చూపి రబ్బరు దిగుమతులపై ఆంక్షలు విధించడం లేదు. మరోవైపు దేశంలో పేరెన్నికగన్న అపోలో టైర్స్ లిమిటెడ్, ఎంఆర్‌ఎఫ్ లిమిటెడ్, సియట్ లిమిటెడ్, జేకే టైర్ అండ్ ఇండిస్టీస్ లిమిటెడ్, బిర్లా టైర్స్ లిమిటెడ్ కుమ్మక్కై రబ్బరు ధరలను తగ్గించాయి. దీనిపై స్పందించిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆ కంపెనీలకు రూ.1,788 కోట్ల జరిమానా విధించింది.
సెమినార్‌ను ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్ మట్లాడుతూ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ జోక్యం కారణంగానే రబ్బరు రైతులకు స్థిరమైన ధరలు లభిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ విధానాల కారణంగానే చిన్నకారు రైతులు, కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ తెలిపారు. దశాబ్దం క్రితం రూ.240గా ఉన్న కిలో రబ్బరు ధర ఇప్పుడు రూ.120కి పడిపోయిందని అన్నారు. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల తప్పుడు విధానాలే ఈ దుస్థితికి కారణమని చెప్పారు. పరిశ్రమను తిరిగి గాడిలో పెట్టేందుకు విధానపరమైన మార్పులు తీసుకురావాలని సెమినార్ సూచించింది.










