Oct 28,2023 08:05

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన శ్రీసత్యసాయి జిల్లాలో గోరంట్ల మండలం కలిగిరి, వానవోలు గ్రామాలకు చెందిన 13 మంది వలస కూలీల కుటుంబాలకు రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా, భూమిలేని పేదలకు రెండెకరాల భూమి ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. వలస కార్మికుల మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం తీవ్రమైన కరువు వల్ల గ్రామాల్లో వ్యవసాయ పనులు లేకపోవడం, ప్రభుత్వం ఉపాధి పనులు కల్పించకపోవడంతో బతుకు తెరువు కోసం కార్మికులు అనివార్యంగా బెంగళూరు వెళుతున్నారని తెలిపారు. ప్రతియేటా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల నుండి 25 లక్షల నుండి 30 లక్షల మంది వలస పోతుంటారని, గ్రామాల్లో ప్రభుత్వం ఉపాధిహామీ పనులు కల్పించి ఉంటే ఇటువంటి ఘటనలు జరిగేవి కావని తెలిపారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

  • జగన్‌ సర్కారుకు కరువు నివారణపై దృష్టి లేదు : సిపిఐ

జగన్‌ సర్కారుకు కరువు నివారణ చర్యలపై దృష్టి లేదని, అందువల్లే కార్మికులు వలసలు పోతూ ప్రమాదాలకు గురవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు పెరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.