అశ్విన్‌కు మళ్లీ అగ్రస్థానం
ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్‌మండలి(ఐసిసి) తాజా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారతజట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ ర్యాంకింగ్‌కు మెరుగైంది. ఇక అరంగేట్రం టెస్ట్‌లోనే 171పరుగులతో మెరిసిన యశస్వి జైస్వాల్ టెస్ట్ బ్యాటర్స్ జాబితాలో 73వ స్థానంలో నిలిచాడు. డొమినికా వేదికగా జరిగిన టెస్టులో రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్‌లో పదో సెంచరీని నమోదు చేశాడు. అంతకుముందు 13వ ర్యాంకులో ఉన్న రోహిత్.. తాజా ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి చేరుకున్నాడు. యాక్సిండెంట్ కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ 11వ స్థానానికి పడిపోయాడు. విండీస్‌పై అర్ధశతకంతో రాణించిన విరాట్ కోహ్లీ 14వ స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్.. టెస్టుల్లో నెంబర్ వన్ బౌలర్‌గా తన స్థానాన్ని కాపాడుకున్నాడు. ప్రస్తుతం అతను 884 రేటింగ్ పాయింట్లతో ఉన్నాడు. ప్యాట్ కమిన్స్(ఆస్ట్రేలియా) 828 పాయింట్లతో రెండోస్థానంలో ఉండగా.. జడేజా మూడు స్థానాలు ఎగబాకి 779 రేటింగ్ పాయింట్లతో ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఏడాదికిపైగా ఆటకు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా పదో స్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 449 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని కాపాడుకున్నాడు. ఈ క్రమంలో 362 రేటింగ్ పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో, అక్షర్ పటేల్ ఐదో స్థానంలో ఉన్నారు.










