Jul 19,2023 22:15

రెండో వన్డేలో 108పరుగుల తేడాతో గెలుపు
బంగ్లాదేశ్‌ మహిళలతో వన్డే సిరీస్‌
ఢాకా: బంగ్లాదేశ్‌ మహిళలతో జరిగిన రెండో వన్డేలో భారత మహిళలజట్టు చెలరేగింది. తొలి వన్డేలో ఓటమికి భారత అమ్మాయిలు బదులు తీర్చుకున్నారు. జెమీమా రోడ్రిగ్స్‌ బ్యాటింగ్‌లో రాణించి 86పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌ చేసి నాలుగు వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించింది. ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ సేన 108 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ ప్రియా పునియా (7) త్వరగానే పెవిలియన్‌బాట పట్టింది. అయితే, యస్టికా భాటియా(15)తో కలిసి మరో ఓపెనర్‌ స్మృతి మంధాన(36) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించింది. కానీ, వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో భారత్‌ కష్టాల్లో పడింది. జెమీమా రోడ్రిగ్స్‌(86), కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌(52) నాల్గో వికెట్‌కు 131 పరుగులు జోడించారు. హర్లీన్‌ డియోల్‌ (25)కూడా బ్యాట్‌ను ఝుళిపించడంతో భారత్‌ మంచి స్కోరునే బోర్డుపై ఉంచగలిగింది. ఆఖర్లో వరుసగా వికెట్లు పడకుండా ఉంటే మెరుగైన స్కోరు సాధించే అవకాశం ఉండేది. బంగ్లా బౌలర్లు సుల్తానా ఖతున్‌, నహిదా అక్తర్‌కు రెండేసి, మరుఫా అక్తర్‌, రబెయా ఖాన్‌ చెరో వికెట్‌ తీసారు. ఛేదనలో బంగ్లాదేశ్‌ 35.1 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ ఫర్గానా హక్‌(47), రితు మోని (27) మాత్రమే కాస్త పోరాడారు. భారత బౌలర్లలో జేమీమా రోడ్రిగ్స్‌కు నాలుగు, దేవికా వైద్యకు మూడు.. మేఘ్నా సింగ్‌, దీప్తి శర్మ,  రాణాకు ఒక్కో వికెట్‌ దక్కాయి. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో ఇరుజట్లూ 1-1తో సమంగా ఉండగా.. చివరి వన్డే జులై 22న జరగనుంది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన జెమీమా రోడ్రిగ్స్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.