Oct 21,2023 11:43

అమరావతి : '' పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని... సైకో పాలనలో సైకిల్‌ తొక్కినా నేరమే ! '' అంటూ ... టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మద్దతుగా చిత్తూరు జిల్లా పుంగనూరులో సైకిల్‌ యాత్రగా సాగుతున్న టిడిపి కార్యకర్తలపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసిన వీడియోను లోకేశ్‌ ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. శనివారం ట్వీట్‌ ద్వారా లోకేశ్‌ ధ్వజమెత్తారు.

'' అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి.. పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్‌ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడు. బాబుతో నేను అంటూ సైకిల్‌ యాత్ర చేస్తున్న టిడిపి కార్యకర్తలపై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్‌ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అధికారం ఇచ్చింది టిడిపి కార్యకర్తల చొక్కాలు విప్పించడానికి, జెండాలు పీకడానికా జగన్‌ ? వచ్చే ఎన్నికల్లో వైసిపి నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డుపై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు '' అని లోకేశ్‌ నిప్పులుచెరిగారు.