May 28,2023 08:22

పెట్రోల్‌తో పనిలేదు.. పైసలెక్కువ అక్కర్లేదు.. పర్యావరణ హితం.. ఆరోగ్యానికి దోహదం.. సామాన్యుని వాహనం.. మధ్యతరగతి నేస్తం.. అదే సైకిల్‌.. అయితే.. సాంకేతికపరంగా ఎన్నెన్నో సౌకర్యాలు రావడంతో సైకిల్‌ వాడకం మరుగున పడిపోయింది. సైకిల్‌ అనేది సరళమైన, సరసమైన, పర్యావరణ అనుకూలమైన వాహనమని చెప్పవచ్చు. అయినా దీని వాడకం ప్రస్తుతం తగ్గిపోయింది. జూన్‌ 3న ప్రపంచ సైకిల్‌ దినోత్సవం. ఈ సందర్భంగా సైకిలింగ్‌తో కలిగే ప్రయోజనాల గురించి ఈ ప్రత్యేక కథనం.

 bicycle


సైకిల్‌ ఓ మధురమైన జ్ఞాపకం.. నాన్న తొక్కుతుంటే.. క్యారల్‌ మీద కూర్చుని పరిగెత్తుతున్న ప్రపంచాన్ని చూడడం ఎప్పటికీ మరవలేం. సైకిల్‌ తొక్కడం నేర్చుకునే సమయంలో తగిలిన గాయాలన్నీ తియ్యని గుర్తులే.. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సైకిల్‌పై స్నేహితులతో పక్క ఊర్లో మిత్రులను కలవడం.. ఇంటికొచ్చాక తిట్లు తినడం.. లాంటివి ఓ 20-30 ఏళ్ల నాడు చాలామంది జ్ఞాపకాలు. అలాంటి సైకిల్‌ ఈ రోజుల్లో వ్యాయామం కోసం, బరువు తగ్గడం కోసం వాడుతున్నారు. కానీ.. ఎన్ని రకాల వాహనాలొచ్చినా ఆరోగ్యకరమైన, పర్యావరణ హితమైన వాహనం మాత్రం సైకిలే. 'రహదారి భద్రతను మెరుగుపరచడం' అనేది ఈ ఏడాది థీమ్‌.
ఒకప్పటి

  • స్టేటస్‌ సింబల్‌..

పల్లె, పట్నం అనే తేడా లేకుండా 90వ దశకం వరకూ పెళ్లి సంబంధాలు మాట్లాడేప్పుడు సైకిల్‌ పెట్టడం అనేది ఘనంగా ఉండేది. సైకిల్‌ తర్వాతే మిగిలిన మాట మంతీ నడిచేవి. ఇక పిల్లలు స్కూల్‌కి వెళ్లడం దగ్గర నుంచి మొదలుపెడితే పెద్దవాళ్లు పొలం పనులకు వరకూ సైకిల్‌ది ప్రత్యేక స్థానం. పాలు, పేపర్‌ బారులకు సైకిలే జీవనాధారం. సైకిల్‌కి కూడా లైసెన్స్‌, ఫైన్స్‌లు వంటివి ఉండేవి. ఇక కొన్ని వాణిజ్య సంస్థల లక్కీ డ్రాల్లో ఇప్పటి కార్ల స్థానంలో సైకిళ్లు ఉండేవి..

  • సైకిల్‌ స్టాండ్లు..

ప్రతి టౌన్‌లోనూ అద్దెకు సైకిళ్లు ఇచ్చే సెంటర్లు ఉండేవి. సినిమాహాళ్లు, పార్కులు, స్కూళ్లలో సైకిల్‌ స్టాండ్లు ఉండేవి. ఇక సినిమాల్లో అయితే సైకిళ్లపై పాటలు ఉండేవి.. 'మగ మహరాజు' సినిమాలో మెగాస్టార్‌గా చిరంజీవి 'నీ దారి పూల దారి' అంటూ ఎనిమిది రోజుల పాటు నాన్‌స్టాప్‌గా సైకిల్‌ తొక్కి అందరినీ అలరించారు. అంతకుముందే ఎన్టీఆర్‌ సైకిల్‌ ఎక్కి ముఖ్యమంత్రి అయ్యారు. అంతటి ఘన చరిత్ర సైకిల్‌ది.

 bicycle
  • ఇలా వచ్చింది ..

ఏటా జూన్‌ 3వ తేదీని 'ప్రపంచ సైకిల్‌ దినోత్సవం'గా పాటిస్తున్నారు. పోలాండ్‌కి చెందిన లెస్జెక్‌ సిబిల్స్కి అనే సామాజికవేత్త చేసిన కృషి ఫలితంగా సైకిల్‌ డే ఆవిర్భవించింది. ప్రపంచ సైకిల్‌ దినోత్సవం ప్రకటించాలంటూ సైకిల్‌ వేసుకుని తిరుగుతూ 57 ఇతర దేశాల మద్దతు కూడగట్టారు. సైకిల్‌ పెడల్స్‌ అరిగేలా ఐక్యరాజ్యసమితి కార్యాలయం చుట్టూ సైకిల్‌పై తిరిగారు. ప్రొఫెసర్‌ స్వన్సన్‌ సహకారంతో ఐజాక్‌ ఫెల్డ్‌ ప్రపంచ సైకిల్‌ దినోత్సవం కోసం లోగోను తయారుచేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ రకాల ద్విచక్ర వాహనదారులకు చిహ్నంగా ఉంది. చివరకు సిబిల్స్కి శ్రమ ఫలించి, 2018లో న్యూయార్క్‌లో జరిగిన 72వ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 193 కంటే ఎక్కువ సభ్యదేశాల ఆమోదంతో.. జూన్‌ 3ను ప్రపంచ సైకిల్‌ దినోత్సవంగా ప్రకటించారు.

 bicycle
  •  కాలుష్య రహితం..

కొన్నేళ్లుగా ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్న ఒకే ఒక్క అంశం గ్లోబల్‌ వార్మింగ్‌, పర్యావరణ సమతుల్యత కాపాడటం. కాలుష్యం విడుదల చేయకుండా రవాణా సౌకర్యం కల్పించడం సైకిల్‌ ప్రత్యేకత. అంతేకాదు సైకిల్‌ తొక్కడం వల్ల శారీరక వ్యాయమం కూడా కలుగుతుంది. మెయింటనెన్స్‌ ఖర్చు అతి తక్కువ. ఇలా సైకిల్‌తో అనేక ఉపయోగాలు ఉన్నాయి.

  • పిలుపులో తేడా..

బైస్కిల్‌కీ సైకిల్‌కీ తేడా ఉంది. అది ఏంటి అనే డౌట్‌ మనకు తరచూ వస్తూ ఉండవచ్చు. నిజానికి దాన్ని బైస్కిల్‌ అనే పిలవాలి. దాన్ని తొక్కడాన్ని సైకిల్‌, సైక్లింగ్‌ అంటాం. కానీ వాడుక భాషలో.. సైకిల్‌ అనే పదం మనకు అలవాటైంది. మనలో చాలా మంది చిన్నతనం సైకిల్‌తో ముడిపడి ఉంటుంది. తలుచుకుంటే ఎన్నో స్మృతులు. సైకిల్‌ తొక్కిన తర్వాతే... మనం బైక్‌, కారును నడుపుతున్నాం..

 bicycle
  • ఐక్యరాజ్య సమితి సూచనలతో..

కాలుష్యం తగ్గించడంతో పాటు ఆరోగ్యానికి మేలు చేసే సైక్లింగ్‌ను ప్రోత్సహించాలంటూ సభ్య దేశాలకు ఐక్యరాజ్య సమితి విజ్ఞప్తి చేస్తోంది. చాలా దేశాలు ఈ సూచనలు పాటిస్తున్నాయి. మన దేశంలో ఇప్పటికే అనేక నగరాల్లో ఈ తరహా సూచనలు పాటిస్తున్నారు. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ రోడ్లపై సైక్లింగ్‌కు ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయించాలి. తద్వారా సైకిళ్లను ప్రోత్సహించవచ్చు. ఉదాహరణకు కేరళలోని త్రివేండ్రం, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌లో సంజీవయ్య పార్కు, వరంగల్‌లో నిట్‌ వంటి కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక సైక్లింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. చాలా దేశాలలో, జూన్‌ 3న సైకిల్‌ ర్యాలీలు, రేసులు నిర్వహిస్తారు. దీనిలో ప్రజలు పాల్గొంటారు.

 bicycle
  • అనేక మోడళ్లు..

సుమారు 20 రకాలకు పైగా మోడళ్లలో ఇప్పుడు సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. మౌంటేన్‌, రోడ్‌, హైబ్రిట్‌/ గేర్‌, ఫోల్డింగ్‌, టూరింగ్‌, క్రూసర్‌, టాన్డెమ్‌, సైక్లోక్రాస్‌, రికుంబెంట్‌, ఫిక్స్‌డ్‌ గేర్‌/ ట్రాక్‌, ఎలక్ట్రిక్‌, ఫ్యాట్‌, బిఎంఎక్స్‌, యుటిలిటీ, ట్రై, హైడ్రాలిక్‌ సైకిల్‌ వంటివి మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

 bicycle
  • తెలుసుకుందాం...
  1.  మొదటిసారి బైస్కిల్స్‌ను సృష్టించిన దేశం ఫ్రాన్స్‌. అయితే... ఇప్పుడు మనం వాడుతున్న డిజైన్‌ సైకిళ్లను తయారుచేసింది మాత్రం ఇంగ్లండ్‌.
  2.  సైకిళ్ల పరిశ్రమ విలువ ఏడాదికి 4500 కోట్ల డాలర్లు ఉంటుంది. దాదాపు 10 కోట్ల సైకిళ్లు తయారవుతున్నాయి
  3.  ప్రస్తుత రూపంలో ఉన్న సైకిలును 1817లో కనిపెట్టారు.
  4.  సైకిల్‌పై అత్యంత వేగంగా వెళ్లిన బైక్లిస్ట్‌ జాన్‌ హోవార్డ్‌. అమెరికా రైడర్‌. సమాంతర ఉపరితలంపై అతను గంటకు 133.75 కిలోమీటర్ల వేగంతో వెళ్లాడు.
  5.  నెదర్లాండ్స్‌లో 15 ఏళ్లు దాటిన ప్రతి 8 మందిలో ఏడుగురికి బైస్కిల్‌ ఉంటుంది.
  6.  ప్రపంచంలో పొడవైన బైస్కిల్‌ 20 మీటర్ల కంటే పెద్దదే. దానిపై 35 మంది కూర్చునే వీలుంది.
  7.  సైక్లిస్టుల సంఖ్య 3 రెట్లు పెరిగితే... బైక్‌ రోడ్డు ప్రమాదాలు సగం తగ్గిపోతాయి.
  8.  భారత్‌తోపాటు.. ఆసియా, ఆఫ్రికా దేశాల ప్రజలు సైకిల్స్‌ ఎక్కువగా వాడుతున్నారు.
  9.  టైప్‌ 1, టైప్‌ 2 డయాబెటిస్‌ పేషెంట్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సైక్లింగ్‌ బాగా పనిచేస్తుంది.
  10. గుండె జబ్బులు వచ్చే అవకాశాల్ని సైకిల్‌ బాగా తగ్గించగలదు. ఇది గుండె కండరాల్ని బలంగా చేస్తుంది. రక్తంలో కొవ్వు నిల్వల స్థాయిని తగ్గిస్తుంది. పల్స్‌ పడిపోకుండా చేస్తుంది.
  11. కండరాల జీవితకాలం పెరగాలంటే... తరచుగా సైక్లింగ్‌ చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు కూడా తలకు హెల్మెట్‌, కాళ్లకు షూస్‌ వంటి అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
  12. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో బైక్‌ షేరింగ్‌ పథకాలు ప్రజలను సైకిళ్ల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తున్నాయి.

ఉదయ్ శంకర్‌ ఆకుల
7989726815