Jun 04,2023 07:47

భూమిపైనే కాకుండా ఇతర గ్రహాలపైనా తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు కొన్నేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అంగారకుడి (మార్స్‌) పై జీవం ఉనికికి సంబంధించి పరిశోధనలు ముమ్మరంగా జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఆ పరిశోధనలు ఫలించి, అక్కడ మానవుడు జీవనానికి కాలనీలు పూర్తి చేస్తే..! ఒకవేళ అక్కడ నివాసం ఉండాల్సి వస్తే.. మిగిలిన వంతు ఆహారానిదే.. ఎందుకంటే భూమిపై ఉన్న ఆహారాన్ని తీసుకెళ్లడం అంత సాధ్యమయ్యే పనికాదు.. ఇందులో భాగంగానే అంగారకునిపై పండే ఓ కొత్త రకం వరి కనుగొన్నారు శాస్త్రవేత్తలు.. ఆ విశేషాలు ఏంటో తెలుసుకుందాం..!
మనిషి ఆలోచనలు భూమి నుంచి అంతరిక్షానికి చేరుకున్నాయి. అందులో భాగంగానే ఇతర గ్రహాలపైనా జీవం ఉనికికి సంబంధించి గత కొన్నేళ్లుగా పరిశోధనలు జరగుతున్నాయి. తద్వారా ఇతర గ్రహాలపైనా మనిషి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మార్స్‌ గ్రహంపై జీవం ఉనికి ఆధారాలు లభించాయి. దీంతో అంగారకుడి మీదికి మనుషులను పంపించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎలన్‌ మస్క్‌ లాంటి వారు సైతం ఇందుకోసం పరిశోధనలు చేస్తున్నారు. అంతేకాకుండా అక్కడ మనుషులతో కూడిన కాలనీలు ఏర్పాటు చేయాలనేది తన లక్ష్యమని మస్క్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.. మనుషులను పంపించడం వరకూ ఓకే.. కానీ అక్కడికి వెళ్లిన వారికి ఆహారం లాంటి అవసరాల సంగతేంటి.? ఇప్పుడిదే.. వారిని వెంటాడుతోన్న ప్రశ్న.. ఇందులో భాగంగానే గ్రహాలపై ఆహార పంటలు పండించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇందులో భాగంగానే 2011లో ఆండీ వీర్‌ రచించిన పుస్తకం 'ది మార్టిన్‌'లో సూచించిన బంగాళాదుంపలు వంటి దుంప రకం వంటకాల్ని మర్చిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అయితే అక్కడ ఆహారంగా జన్యుపరంగా మార్పు చేసిన కొత్త రకం బియ్యాన్ని పరిశోధకులు కనుగొన్నారు.

Rice-crop-on-the-red-planet
  • గ్రహాంతర నివాసం కోసం..

భూమి నుంచి అంగారకుడిపైకి 300 మిలియన్‌ మైళ్ల / 480 మిలియన్‌ కిలోమీటర్ల దూరం.. ఇందుకు కనీసం ఏడు నెలల ప్రయాణం. గ్రహాలు భూమికి దగ్గరగా ఉన్నప్పుడు అంటే ప్రతి రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఆ ప్రయాణం సులభంగా చేయవచ్చు. కాబట్టి అంగారకగ్రహంపై నివసించే మొదటి మానవులు తమ సొంత ఆహారాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. అయితే అంగారకుడి మీదకు వెళ్లే వారి అవసరాల కోసం కావాల్సిన వస్తువులను భూమి మీద నుంచి తీసుకెళ్లడం కుదరదు. కాబట్టి శాస్త్రవేత్తలు అంగారకుడి మీదనే పంటలు పండించేందుకు ఉన్న అవకాశాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ ఆఫ్‌ ఆర్కాన్సాస్‌ మార్స్‌ గ్రహంపై వరి పంట పండించేందుకు సంబంధించిన ఓ పరిశోధన చేసింది. ఈ పరిశోధనకు అభిలాష్‌ రామచంద్రన్‌ నాయకత్వం వహించారు.

  • పర్‌క్లోరేట్‌ ప్రభావాన్ని తగ్గించి...

ఈ ప్రయోగం కోసం అమెరికాలోని మొజావే ఎడారికి చెందిన శిలల పొడితో అచ్చం మార్స్‌ మీద ఉండే మట్టిని తయారుచేశారు. ఈ మట్టిలో మొక్కలు పెరిగేందుకు అవసరమైన మిశ్రమాలు కలిపి, కుండీల్లో నింపారు. ఈ కుండీల్లో వడ్లను చల్లి, రోజుకు రెండుసార్లు నీళ్లు పోశారు. ఆశ్చర్యకరంగా అన్ని కుండీల్లో వరి గింజలు మొలకెత్తాయి. అయితే కిలో మట్టిలో మూడు గ్రాముల కన్నా ఎక్కువ పర్‌క్లోరేట్‌ కెమికల్‌ ఉంటే వడ్లు మొలకెత్తలేదు. దీంతో పర్‌క్లోరేట్‌ను తట్టుకునేలా జన్యుపరంగా మార్చిన అడవి వంగడాన్ని పరీక్షించారు. ఒక గ్రాము వరకూ పర్‌క్లోరేట్‌ ఉన్న మట్టిలో వడ్లు మొలకెత్తాయి. ఈ పరిశోధన ఫలితాలు అంగారకుడి మీదకు చేపట్టనున్న ప్రయోగాలకు సహాయపడనున్నాయి. ఈ విషయాన్ని 54వ లూనార్‌ అండ్‌ ప్లానిటరీ సైన్స్‌ కాన్ఫరెన్స్‌లో సమర్పించిన కొత్త పరిశోధనలు మార్టిన్‌ రెగోలిత్‌లో జన్యుపరంగా మార్పు చెందిన బియ్యం పెరుగుతాయని సూచిస్తున్నట్లు నాసా ప్రకటించింది. కాగా తదుపరి దశలో గ్రహాలపై ఉష్ణోగ్రతలు, వాతావరణాన్ని ప్రతిబింబించే మార్స్‌ సిమ్యులేషన్‌ ఛాంబర్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు.