Oct 31,2023 14:29

మాచారెడ్డి: కొడంగల్‌లో నరేందర్‌రెడ్డిపై ఓడిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కేసీఆర్‌పై గెలుస్తారా అని మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. మాచారెడ్డి, రామారెడ్డి మండలాల బిఆర్‌ఎస్‌ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. కొడంగల్‌లో గెలవని రేవంత్‌రెడ్డి.. కామారెడ్డిలో గెలుస్తారా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తానంటున్న రేవంత్‌ డిపాజిట్‌ను కామారెడ్డి ప్రజలు గల్లంతు చేస్తారని చెప్పారు.''పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల సమస్యలు కేసీఆర్‌ పరిష్కరించారు. గజ్వేల్‌ మాదిరిగానే కామారెడ్డిలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక అధికారిని నియమించి కామారెడ్డి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కేసీఆర్‌ నియోజకవర్గం కామారెడ్డిలో దశాబ్దాలుగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి'' అని కేటీఆర్‌ వెల్లడించారు.