Oct 03,2023 09:47

ప్రజాశక్తి-నార్పల (అనంతపురం) : మండల కేంద్రం అయిన నార్పల పాత బస్టాండు కుతలేరు వంక సమీపంలో ఆక్రమణలను మంగళవారం భారీ పోలీసు బందోబస్తు నడుమున తొలగించారు. మండల కేంద్రమైన నార్పల్లో గత కొన్ని సంవత్సరాలుగా కుతలేరు నూతన వంతెన నిర్మాణం ఆగిపోయింది. వంతెన నిర్మాణం ముందుకు సాగాలంటే ఆక్రమణలు తొలగిపోవాలని గత కొన్ని రోజుల నుండి నార్పల్లో ఆక్రమణలను తొలగిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఒక్కసారిగా మంగళవారం భారీ పోలీస్‌ బందోబస్తు మధ్యన బస్టాండ్‌ లోని పలు ఆక్రమణలను తొలగించారు. బస్టాండ్‌ ఆవరణంలో ఉన్న పురాతన దేవాలయమైన కొల్లాపూర్మ్మ ఆలయాన్ని కూడా తొలగిస్తున్నారని ప్రచారం సాగడంతో గ్రామస్తులు భారీ ఎత్తున బస్టాండుకు చేరుకున్నారు. ఆక్రమణలు మాత్రమే తొలగిస్తున్నామని గ్రామ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ కొల్లాపూరమ్మ గుడిని తొలగించడం లేదని తహశీల్దార్‌ హరికుమార్‌, ఎంపీడీవో దివాకర్‌, ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. ఆక్రమణల తొలగింపు సందర్భంగా మండలంలోని అధికార గణం మొత్తం ఉదయాన్నే బస్టాండుకు చేరుకున్నారు. ఆక్రమణల తొలగింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిఐ అస్రార్‌ భాష, ఎస్సై రాజశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ తొలగింపు కార్యక్రమంలో ... డిప్యూటీ తహశీల్దార్‌ సురేష్‌ బాబు, నార్పల మేజర్‌ పంచాయతీ కార్యదర్శి అస్వత్త నాయుడు, గ్రామాధికారులు నాగరాజు, రామకృష్ణ, వెంకటేశు, ఆర్‌ అండ్‌ బి అధికారులు, రెవిన్యూ అధికారులు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.