Oct 10,2023 11:07
  • ఎల్‌ఎహెచ్‌డిసి ఫలితాలపై ఒమర్‌ అబ్దుల్లా
  • జమ్ముకాశ్మీర్‌ ఎన్నికలు ఆలస్యంపై ఇసికి ప్రశ్నలు

శ్రీనగర్‌ : బిజెపి, దాని అనుబంధ పార్టీల విధానాలను జమ్ముకాశ్మీర్‌ ప్రజలు తిరస్కరిస్తున్నారని చెప్పడానికి లడఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఎహెచ్‌డిసి) ఫలితాలే నిదర్శమని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) ఉపాధ్యక్షులు ఒమర్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ఎల్‌ఎహెచ్‌డిసి ఎన్నికల్లో మొత్తం 26 స్థానాలకు గాను ఎస్‌సి-కాంగ్రెస్‌ కూటమి 22 స్థానాలో విజయం సాధించింది. బిజెపి రెండుచోట్ల, స్వతంత్ర అభ్యర్థులు మరో రెండు చోట్లు గెలుపొందారు. ఈ సందర్భంగా ఒమర్‌ అబ్దుల్లా సోమవారం శ్రీనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బిజెపి జమ్ముకాశ్మీర్‌ను విభజించడం, ఆర్టికల్‌ 370ను రద్దు చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సోమవారం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఇసిఐ, జమ్ముకాశ్మీర్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించలేదు. 'సరైన సమయం'లో ఎన్నికలు జరుగుతాయని మాత్రమే చెప్పింది. 'ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించగలిగితే.. జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికలు ఎందుకు జరగవు? జమ్ముకాశ్మీర్‌ ప్రజల ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నందుకు ఇసిఐ వారికి సమాధానం చెప్పాలి' అని ఒమర్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు.
             ఎన్నికలు కూడా నిర్వహించలేని దారుణ పరిస్థితి జమ్ముకాశ్మీర్‌లో ఉందా అని ప్రశ్నించారు. జమ్ముకాశ్మీర్‌ ప్రశాంతంగా ఉందని, వేలాది మంది పర్యాటకులు వస్తున్నారని ప్రపంచవ్యాప్తంగా భారత ప్రభుత్వం కథలు చెబుతుందని విమర్శించారు. ఎల్‌ఎహెచ్‌డిసి ఫలితాలతో జమ్ముకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్‌ఎహెచ్‌డిసి ఫలితాలపై పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పిడిపి), కాంగ్రెస్‌ తదితర పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి.