ప్రజాశక్తి-ఉరవకొండ (అనంతపురం) : మాజీ ముఖ్య మంత్రి, ప్రతిపక్ష నాయకుడు అయిన చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ప్రభుత్వం 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. గురువారం ఉరవకొండలో టిడిపి పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని ఇది ఎంతకాలం కొనసాగదని పేర్కొన్నారు. ప్రాజెక్టుల సందర్శన కోసం ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు వెళుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి భయం పట్టుకున్నదని అందుకే ఆయనపై కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై గౌరవం గాని ప్రజాస్వామ్యంపై నమ్మకం కానీ లేకుండా పోయిందని అందుకే ఇస్టారాజ్యాంగ పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు. టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానాలు రాష్ట్ర ప్రజలందరికీ 40 సంవత్సరాలుగా తెలుసని ఆయనకు కేవలం అభివృద్ధి పట్ల ఆకాంక్ష,రాష్ట్ర ప్రజల అభివృద్ధి పైన ఆయన పనిచేస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తిపై కేసులు నమోదు శోచనీయమన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంకుశ విధానాలకు తావు లేదన్నారు. చరిత్రలో ఎంతోమంది హిట్లర్ లాంటి నియంతులు ఇలాంటి విధానాలను అవలంబించి కనుమరుగయ్యారని ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలే గుణపాఠం చెప్తారని ఎమ్మెల్యే ఆరోపించారు.










