
- రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం : పెద్దిరెడ్డి సవాల్
ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : రాయలసీమ ప్రాజెక్టులపై చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదని, కుప్పంలో చర్చకు తమ పార్టీ సిద్ధమని రాష్ట్ర అటవీ ఇంధన, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. తిరుపతి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడుతూ 14 ఏళ్లు సిఎంగా ఉండి సొంత నియోజకవర్గానికి నీరు ఇవ్వలేకపోయిన అసమర్థుడు చంద్రబాబని ఎద్దేవా చేశారు. ఆయన రాయలసీమ కోసం అంటూ చేసేది 'ఏపుడు యాత్ర' మాత్రమేనన్నారు. చంద్రబాబు ఏం చేశారో, వైఎస్ జగన్ ఏం చేశారో కుప్పంలోనే చర్చిద్దామన్నారు. గండికోట ద్వారా పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు, మదననపల్లికి నీరు అందించేందుకు వైఎస్ జగన్ ఆవులపల్లి, నేతిగుంట్లపల్లి, ముదివేడు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే సుప్రీంకోర్టుకు వెళ్లి చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. కుప్పం బ్రాంచి కెనాల్‌నూ కమీషన్ల కక్కుర్తితో పూర్తి చేయలేదని విమర్శించారు. 200 కోట్ల అంచనా వ్యయాన్ని 440 కోట్లకు పెంచి సిఎం రమేష్‌కు పనులు కట్టబెట్టలేదా అని ప్రశ్నించారు. గాలేరు-నగరి ప్రాజెక్టుకు 1995 నుంచి 2004 వరకూ ఖర్చు చేసింది అక్షరాలా 17.52 కోట్లు మాత్రమేనని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 4,283.08 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.