బెంగళూరు : పాఠశాలలు, కళాశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో తప్పనిసరిగా రాజ్యాంగ పీఠికను చదవాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీ సమీపంలో రాజ్యాంగ పీఠికను చదివారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని సిఎం సహా డిప్యూటీ సిఎం డికె శివకుమార్, మంత్రులు జి.పరమేశ్వర, రామలింగారెడ్డి, ఈశ్వర్ ఖండ్రే, కెజె జార్జ్, ఎమ్మెల్యే రిజ్వాన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హెచ్‌సి మహదేవప్ప మాట్లాడుతూ.. 'మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక విధులను పౌరులు నిర్వర్తించాలి. అందుకే పాఠశాలలు, కళాశాలల్లో రాజ్యాంగ ప్రవేశికను చదవడం తప్పనిసరి చేశాం. దాంతో పిల్లలకు రాజ్యాంగ విధుల గురించి తెలుస్తుంది. ఏ ఆదర్శాలు, సూత్రాల ఆధారంగా రాజ్యాంగం రూపొందించారో వారికి అవగాహన వస్తుందని' చెప్పారు.










