మూడు నెలలుగా ఆగిన కందిపప్పు పంపిణీ
బహిరంగ మార్కెట్లో పెరిగిన ధర
సరఫరా సంస్థలు నిలిపివేతే కారణమంటూ ప్రభుత్వం ప్రచారం
ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌లో ఏ సరుకు ఏ నెల అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. జూన్, జులైలో లబ్ధిదారులకు కందిపప్పు ఇవ్వలేదు. కనీసం ఆగస్టులోనైనా ఇస్తుందని కార్డుదారులు ఆశించారు. ఈ నెలకు సంబంధించీ జిల్లాలకు కందిపప్పు ఇచ్చే పరిస్థితి లేదు. రెండు నెలలకు సంబంధించిన కందిపప్పును ఆగస్టు నెల రేషన్‌తో కలిపి ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఇటీవల ప్రకటించినా, లబ్ధిదారులకు కందిపప్పు ఇవ్వడం లేదు. రాష్ట్రానికి కందిపప్పు సరఫరా చేస్తున్న నాగపూర్, రారుపూర్‌కు చెందిన పంపిణీ సంస్థలు ఆపేయడం వల్లే కందిపప్పు రాలేదని తెలుస్తోంది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడమే ఇందుకు కారణమని సమాచారం. దీంతోపాటు రిలయన్స్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 200 మార్టుల ఏర్పాటుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పెద్ద ఎత్తున కందిపప్పు సేకరిస్తోంది. ఫలితంగా రిటైల్ దుకాణాలకు సైతం కందిపప్పు అందించలేకపోతున్నామని హోల్‌సేల్ వ్యాపారులు చెప్తున్నారు. రిటైల్ దుకాణాలకు సరుకు తగ్గడం, ప్రజాపంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా పంపిణీ నిలిచిపోవడంతో కందిపప్పు ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. జూన్‌లో మొదటి రకం కందిపప్పు కేజీ రూ.132 ఉండగా, ప్రస్తుతం రూ.142కు, సాధారణ రకం కందిపప్పు రూ.118 ఉండగా, ప్రస్తుతం రూ.127కు చేరింది.
కేంద్రం తీరుతో లబ్ధిదారులకు అవస్థలు
మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ (ఎండియు) వాహనాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1,47,30,744 రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం రేషన్ సరుకులను అందిస్తోంది. వీటిద్వారా 4,29,27,827 మంది పేదలు లబ్ధి పొందుతున్నారు. ఈ నెలలో గురువారం నాటికి 35,178 మెట్రిక్ టన్నుల బియ్యం, 1,672 టన్నుల పంచదార ఇచ్చారు. 328 టన్నుల గోధుమపిండి అందించారు. రేషన్ పంపిణీలో కేంద్ర ప్రభుత్వ సూచనలతో గత నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెండుసార్లు వేలిముద్రల విధానంతో అటు పేదలు, ఇటు ఎండియు ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నా యోజన (పిఎంజికెఎవై) కింద కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం అందిస్తుండడంతో, వాటి వరకు ప్రత్యేకంగా పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. దీంతో, ఆపరేటర్లు బియ్యం కోసం ఒకసారి, ఇతర సరుకులకు మరోసారి వేలిముద్ర తీసుకుంటున్నారు. ఫలితంగా ఎక్కువ సమయం పడుతోంది. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు క్యూలో నిల్చోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సమస్యను అధిగమించడానికి ఆపరేటర్లు అందరికీ ఒక విడతలో బియ్యం ఇచ్చి, పంచదార, గోధుమపిండి సరుకులను రెండో విడతలో వీధుల్లోకి వాహనం వచ్చినప్పుడు ఇస్తామంటూ పంపిస్తున్నారు. దీంతో, కొంతమంది పంచదార, ఇతర సరుకులకు నోచుకోవడం లేదు. జూన్‌లో పాత విధానంలో పంచదార ఇచ్చినప్పుడు 50,83,716 కార్డుదారులకు పంచదార ఇవ్వగా, రెండుసార్లు వేలిముద్రలు అమల్లోకి వచ్చిన తర్వాత జులైలో 48,14,108 మంది మాత్రమే పంచదార తీసుకోగలిగారు. రెండుసార్లు వేలిముద్రలతో తాము ఇబ్బందులు పడుతున్నామంటూ ఎండియు ఆపరేటర్లు జాయింట్ కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో ఈ నెలలోనూ అదే పద్ధతిలో అందిస్తున్నారు.










