ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి : గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టడంతో పునరావాస కేంద్రాలకు చేరిన బాధితులను నిబంధనల పేరుతో అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే బియ్యం, వంట నూనె ప్యాకెట్, కందిపప్పు వంటివి అందిస్తున్నారు. దీంతో, కట్టుబట్టలతో పునరావాస కాలనీలకు చేరిన వారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీళ్ల చారుతో అధికారులు పెట్టే భోజనం తినలేక, వండుకునేందుకు సరుకులు లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. గోదావరి వరద ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 45 నివాసిత ప్రాంతాలను చుట్టుముట్టింది. 13,764 మంది వరద బాధితులుగా మారారు. ఈ రెండు మండలాల్లో 12 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 4,235 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నేటికీ అనేక మంది కొండలు, గుట్టలపైకి వెళ్లి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
వేలేరుపాడు మండలం సుద్దగుంప గ్రామంలో దాదాపు 36 కుటుంబాలు ఉన్నాయి. వరద నీరు ఈ గ్రామాన్ని చుట్టుముట్టడంతో గ్రామస్తులను బండ్లబోరు గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస కాలనీకి తరలించారు. ఇక్కడ ఎటువంటి సదుపాయాలూ లేవు. టార్పాలిన్లతో గుడారాలు వేసుకుని ఒక్కో గుడారంలో ఐదారు కుటుంబాలు ఉంటున్నాయి. కనీసం టార్పాలిన్లు కూడా ఇవ్వకపోవడంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈ గ్రామస్తులు పలువురికి రేషన్ కార్డులు లేవు. దీంతో, ప్రభుత్వం వరద బాధితులకు అందించే రెండు నెలలకు సరిపడా బియ్యం, వంట నూనె ప్యాకెట్, కందిపప్పు వంటివి వీరికి ఇవ్వడం లేదు. ఈ గ్రామస్తులకే కాదు రేషన్ కార్డులేదన్న సాకుతో ఈ రెండు మండలాల్లోని పునరావాస కేంద్రాల్లోని వరద బాధితులకుగానీ, కొండలు, గుట్టలపై ఉన్న బాధితులకుగానీ ప్రభుత్వం సాయం అందించడం లేదు. రేషన్ కార్డులేని వారు వందల సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. సుద్దగుంప గ్రామస్తులకు ప్రతిరోజూ ట్రాక్టర్‌పై భోజనం తెచ్చి పెడుతున్నారు. ఏదో ఒకకూర, నీళ్లచారుతో భోజనం పెడుతుండడంతో తినలేకపోతున్నా మని వరద బాధితులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులకు, చిన్నపిల్లలకు అరుగుదల సమస్య వస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంట చేసుకుని తిందామంటే రేషన్ కార్డులు లేని కుటుంబాలకు సరుకులు ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అందరికీ సాయం అందించాలని వరద బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.
పునరావాస కేంద్రానికి వెళ్లలేదని
అందని వరద సాయం
వేలేరుపాడు మండలంలోని తాట్కూరు గొమ్ము కాలనీ గ్రామానికి చేరువగా వరద నీరు చేరింది. పునరావాస కేంద్రాలకు వెళ్లలేదనే కారణంతో ఇక్కడి వారికి అధికారులు వరద సాయం అందించలేదు. పనులు వెళ్లేందుకు 15 రోజులుగా అవకాశం లేకుండా పోవడంతో చేతిలో డబ్బులు లేక ఈ గ్రామంలోని 70కిపైగా కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.










