Jul 23,2023 15:58

రాఖీగర్హీ , హర్యానాలోని హిసార్‌ జిల్లాలో ఒక గ్రామం. ఇది ఢిల్లీకి 150 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ సింధు నాగరికతకు ముందే మనిషి ఆవాస స్థలాలు ఉన్నట్లు గుర్తించారు పరిశోధకులు. అలా గుర్తించిన వాటిలో రాఖీగర్హీ ఒకటి. ఇది ఘగ్గర్‌-హక్రా నదీ పరీవాహక ప్రాంతంలో నది నుంచి 27 కి.మీ. దూరంలో ఉంది. నది సమీపంగా ఉండడంతో ఈ లోయ సారవంతమై ఇక్కడ వ్యవసాయం వృద్ధి చెందింది. ఈ ప్రాంతం నివాసయోగ్యమైంది. ఒకప్పటి ఈ రాఖీగర్హీ సందడిగా ఉండే పట్టణంగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా రాఖీగర్హి గ్రామం ఉనికిలో ఉంది. కాకపోతే ఎండిపోయిన సరస్వతి నది ఒడ్డున ఉంది. ఇప్పటివరకూ సింధులోయ నాగరికత గురించి ఉన్న అభిప్రాయాలకు ఈ అధ్యయనాల ద్వారా మరిన్ని వివరాలు తెలుస్తాయని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
రాఖీగర్హి 1963లో హర్యానాలోని హిసార్‌ జిల్లాలో బయటపడింది. సింధు నాగరికతలో అతిపెద్ద నగరంగా గుర్తించబడింది. ఇది హరప్పా, మొహెంజొదారో నగరాల కంటే పెద్దది. హరప్పా కాలం కంటే ముందు నుంచే ఇక్కడ మానవ జీవనం ఒక క్రమపద్ధతిలో జరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. దండయాత్రలు, వలసలు లేవనేది స్పష్టమైంది. ఈ ప్రదేశంలో భారత పురావస్తు శాఖకు చెందిన అమరేంద్రనాథ్‌ ఆధ్వర్యంలో పరిశోధనల నిమిత్తం తవ్వకాలు జరిగాయి.

  • తవ్వకాలలో..

హరప్పా నాగరికత కాలం నాటి ఐదు పెద్ద టౌన్‌షిప్‌లు ఈ తవ్వకాలలో బయటపడ్డాయి. వాటిలో రాఖీఘర్‌ ఒకటి. మిగిలిన నాలుగు పాకిస్తాన్‌లోని హరప్పా, మొహెంజొదారో, గన్వేరివాలా, గుజరాత్‌లోని ధోలావిరా. పురావస్తు తవ్వకాల్లో బయట పడిన హరప్పా నమూనానే పరిణతి చెందినది. అక్కడ ప్రణాళికాబద్ధమైన డ్రైనేజీ వ్యవస్థ, కాల్చిన ఇటుకలతో నిర్మించబడిన ఇళ్లు దీనిని విశదపరుస్తున్నాయి. రాగి, బంగారు ఆభరణాలు, టెర్రకోట బొమ్మలు, మట్టి కుండలు, ముద్రలు, అస్తిపంజరాలు దొరికాయి. గృహోపకరణాలు కూడా సిరామిక్‌ వస్తువులు రెడ్‌ వేర్‌ డిష్‌-ఆన్‌-స్టాండ్‌, వాసే, జార్‌, బౌల్‌, బీకర్‌, చిల్లుల జార్‌, గోబ్లెట్‌, హ్యాండిస్‌ ఇవన్నీ అప్పట్లోనే ఉన్నాయి.

  • నాటి లిపి ..

అంతేకాదు.. ఒకవైపున హరప్పానాటి లిపితో ఉన్న ఐదు అక్షరాలు, మరొకవైపు ఎలిగేటర్‌ చిహ్నం ఉన్న స్థూపాకార ముద్ర ఈ అధ్యయనాల్లో కనుగొన్నారు. బ్లేడ్లు, టెర్రకోట, షెల్‌ బ్యాంగిల్స్‌, సెమీ రాళ్ల పూసలు, టెర్రకోట షెల్‌, రాగి వస్తువులు, జంతువుల బొమ్మలు, కార్ట్‌ ఫ్రేమ్‌లు, టెర్రకోట చక్రం, ఎముక పాయింట్లు, చెక్కబడిన స్టీటైట్‌ సీల్స్‌, సీలింగు, ఖననాలు లభించాయి.
ఉత్సవాలు, జాతరల సమయంలో జంతువులను బలి ఇచ్చే ఆచారముండేది. అలా బలి ఇవ్వడానికి ప్రత్యేకించి ఒక గొయ్యిని ఏర్పాటుచేసి దానిని మట్టి ఇటుకలతో కప్పి ఉంచేవారని ఆధారాలు న్నాయి. మట్టినేలపైనే త్రిభుజాకార, వృత్తాకార అగ్నిమాపక చిహ్నాలు కూడా బయటపడ్డాయి. ఇవన్నీ హరప్పన్ల ఆచార వ్యవహారాలను తెలియజేస్తున్నాయి.

3
  • డిఎన్‌ఏతో..

రాఖీగర్హిలో లభ్యమైన హరప్పా అస్థిపంజరంపై పరిశోధనలు జరిపారు. ఆ అస్థిపంజరానికి సంబంధించిన వ్యక్తి 4500 సంవత్సరాల క్రితం చనిపోయినా డిఎన్‌ఏ పరిశోధనల ద్వారా అప్పటి (హరప్పా) నాగరికత, చరిత్రలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడింది. దక్షిణాసియాలో వేట-సేకరణ నుండి దశల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఈ అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

  • శ్మశాన వాటికలే..

న్యూఢిల్లీకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిసార్‌లోని రాఖీఖాస్‌, రాఖీ షాపూర్‌ గ్రామాలు, వాటి పరిసర ప్రాంతాల్లో లభ్యమైన పురావస్తు అవశేషాలను ఏడు భాగాలుగా విభజించారు. శాస్త్రవేత్తల నివేదిక ప్రకారం, రాఖీగర్హి తవ్వకాలలో ఈ గుట్టలు శ్మశాన వాటికలుగా (ఖననం చేయబడిన స్థావరాలను సూచించే కుప్పలు) తెలిపారు. అయితే ఇప్పుడు అక్కడి స్థానికులు వారి దినచర్యలో భాగంగా ఉపయోగించు కుంటున్నారు.
ఆయా ప్రదేశాల్లో హరప్పా కళాఖండాలు, సీల్స్‌, పూసలు, టెర్రకోట గాజులు సేకరించి జీవనం గడుపుతున్నారు. పశువులను మేపడం, దహన సంస్కారాలు నిర్వహించడం, క్రికెట్‌ మైదానంగా.. ఇలా వివిధ ప్రయోజనాల కోసం వినియోగించు కుంటున్నారు. తరచు పరిశోధనల నిమిత్తం వస్తున్న శాస్త్రవేత్తలతో వీరు అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు.
ఈ తవ్వకాలు 1997-2000, 2012-2016, 2021-22 మధ్య ఎనిమిది సార్లు జరిగాయి. ప్రతి తవ్వకం రెండు నుండి ఐదు నెలల కంటే ఎక్కువ సమయమే పట్టింది. ఇన్నిసార్లు తవ్వారు కదా! సమగ్ర సమాచారం వచ్చేసిందనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. పురావస్తు శాస్త్రంలో, పునఃపరిశీలన అనేది ఒక చక్రం లాంటిది. ప్రతి పరిశోధన లక్ష్యాలు, అన్వేషణలు భవిష్యత్తు అవసరాలు, అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఒక నిరంతర ప్రక్రియ అంటుంది శాస్త్రవేత్తల బృందం.