భరత్‌పూర్ : రాజస్థాన్‌లో భరత్‌పూర్ సమీపంలో జైపూర్ - ఆగ్రా హైవేపై బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్‌తో సహా ముగ్గురు మృతి చెందారు. దాదాపు 20 మందికిపైగా గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ బార్సో గ్రామానికి సమీపంలో జైపూర్ - ఆగ్రా హైవేవై ఆగి ఉన్న ఓ ట్రక్కును బస్సు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఈ ప్రమాదంలో గాయాలపాలైన వారిని అంబులెన్స్‌లో ఆర్‌బిఎం జిల్లా ఆస్పుతికి తరలించారు. మృతదేహాలను అదే ఆసుపత్రిలోని మార్చ్యురీకి తరలించారు. ఇక ఈ ఘటనపై పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి వినోద్ కుమార్ మీనా మాట్లాడుతూ.. 'జైపూర్ నుంచి ఝాన్సీకి వెళుతున్న స్లీపర్ కోచ్ బస్ వెళుతుండగా భరత్‌పూర్‌కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్సో గ్రామ సమీపంలో హైవేపై ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదం మంగళవారం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఝుంఝును వాసులు డ్రైవర్ కమలేష్, కండక్టర్ బ్రిజేంద్ర అక్కడిక్కడే మృతి చెందారు. మరో ప్రయాణీకుడైన గ్వాలియర్ వాసి బంటీ కూడా మృతి చెందాడు. ఈ బస్సులో ఐపిఎస్ ఆఫీసర్ సునీల్ రాథోడ్ కూడా ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. వైద్యుల సూచన మేరకు ఆయనను జైపూర్ తరలించాము. బస్సులో ఉన్న పూజా, సంగీత, లీలూరామ్ సైనీ, సీమా, నవీన్, సైనీ, ఖుష్బూ, రాజేష్, దీనబంధు, బల్లుతో సహా దాదాపు 24 మంది గాయపాలయ్యారు. ప్రయాణీకులంతా గ్వాలియర్, ఝాన్సీ, ఝుంఝును ప్రాంతాలకు చెందిన నివాసితులు.' అని ఆయన అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ చేపట్టినట్లు వినోద్ కుమార్ మీనా చెప్పారు.










