తెలంగాణ : ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ... తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎఐసిసి కార్యాలయానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు, సంతోష్ కుమార్, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, కపిలవాయి దిలీప్ కుమార్, మోత్కుపల్లి నర్సింహులు మరికాసేపట్లో ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. ఈ నేపథ్యంలో ... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
కెసిఆర్ అవినీతిపై బిజెపి చర్యలు తీసుకుంటుందనే ఆ పార్టీలో చేరాననీ... చర్యలు లేనందునే బయటకు వచ్చాననీ రాజగోపాల్ రెడ్డి అన్నారు. బిజెపి లో తనకు గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారు. కానీ తన లక్ష్యం నెరవేరలేదు అని అసహనాన్ని వ్యక్తం చేశారు. హాంగ్ వస్తే బిజెపి, ఎంఐఎం ఎమ్మెల్యేలు బిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారు అని చెప్పారు. బిజెపికి ఓటు వేస్తే బిఆర్‌ఎస్‌కి ఓటు వేసినట్లేనన్నారు. ప్రజలు తాను కాంగ్రెస్‌లో రావాలని కోరుకుంటున్నారు అని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. '' సర్వేల్లో నాకే అనుకూలంగా ఉన్నాయి. కెసిఆర్ ధన, అధికార మదంతో మాట్లాడుతున్నాడు. అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని ఇండియా కూటమికి నిధులు సమకూరుస్తానని ఆఫర్ ఇచ్చాడు '' అంటూ కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.










