- కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాల్లో హామీలన్నీ అమలు చేశాం
- వరంగల్‌లో కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభించిన రాహుల్, ప్రియాంక గాంధీ
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో:బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే బిజెపికి వేసినట్టేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణలో బిజెపి చిరునామా కోల్పోయిందనీ, ఇక్కడ బిఆర్‌ఎస్ గెలవాలని బిజెపి కోరుకుంటోందని చెప్పారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బిజెపి, బిఆర్‌ఎస్, ఎంఐఎం మిలాఖత్ అయ్యాయని తెలిపారు. పార్లమెంట్‌లో బిజెపి ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బిఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. కెసిఆర్‌పై అవినీతి ఆరోపణలున్నా సిబిఐ, ఇడి, ఐటి, ఇతర విచారణ సంస్థలకు అవి కనిపించవనీ..ఇదే బిఆర్‌ఎస్, బిజెపి మిలాఖత్‌కు నిదర్శనమని పేర్కొన్నారు. బుధవారం వరంగల్ వచ్చిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రామప్ప ఆలయాన్ని అగ్రనేతలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డులకు పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్ విజయభేరి యాత్రను రాహుల్, ప్రియాంక గాంధీ ప్రారంభించారు. అనంతరం ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. 'కెసిఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇచ్చారా? ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు.. ఇచ్చారా? డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామన్నారు.. ఎంత మందికి ఇచ్చారు. లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు.. ఎంత మందికి చేశారు? కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలన్నీ మేం నెరవేర్చాం. ఇచ్చిన మాటను కాంగ్రెస్ తప్పకుండా నిలబెట్టుకుంటుంది. దొరల తెలంగాణ.. ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజల పక్షంగా ఉన్న కాంగ్రెస్‌కి మద్దతివ్వాలి' అని రాహుల్ గాంధీ అన్నారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందని అన్నారు. రాజకీయంగా నష్టమని తెలిసినా.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని చెప్పారు. ' తెలంగాణ ప్రజల ఆశలు,ఆకాంక్షలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌గాంధీ ఎప్పుడూ ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాల గురించే ఆలోచించేవారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే రాష్ట్రానికి ఎన్నో జాతీయ సంస్థలు ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఒక రోడ్ మ్యాప్ రూపొందించింది. మీ ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి' అని ప్రియాంక గాంధీ అన్నారు. సభలో తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.










