Sep 17,2023 09:08

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) తాత్కాలిక డైరెక్టర్‌గా 1993 బ్యాచ్‌కు చెందిన ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) అధికారి రాహుల్‌ నవీన్‌ను కేంద్రం శుక్రవారం నియమించింది. కేంద్రం సాయంతో 2018 నవంబర్‌ నుంచి పదవీకాలం పొడిగింపులతో ఇప్పటి వరకూ పదవిలో ఉన్న సంజరు కుమార్‌ మిశ్రా స్థానంలో నవీన్‌ వచ్చారు. రెగ్యులర్‌ డైరెక్టర్‌ నియామకం వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నవీన్‌ ఆ పదవిలో కొనసాగుతారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నది. మిశ్రా పదవీకాలం సెప్టెంబరు 15తో ముగిసింది. జులైలో సుప్రీంకోర్టు ''పెద్ద ప్రజా ప్రయోజనాల'' దృష్ట్యా సెప్టెంబరు 15 వరకు పొడిగింపును మంజూరు చేయటంతో ఇప్పటి వరకూ ఆయన ఆ పదవిలో కొనసాగారు. మిశ్రాకు కేంద్రం గతంలో మంజూరు చేసిన రెండు పొడిగింపులు చట్టవిరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల పేర్కొన్న నేపథ్యంలో ఇది జరగటం గమనార్హం.
 

                                                                     రెండు సార్లు పొడిగింపులు..

మిశ్రా నవంబర్‌ 19, 2018న రెండేండ్ల కాలానికి ఈడీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అతని పదవీకాలాన్ని 2020లో ఒక సంవత్సరం పాటు పొడిగించింది. మిశ్రా పదవీకాలాన్ని ఇకపై పొడిగించవద్దని 2021 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈడీ, సీబీఐ డైరెక్టర్‌లకు ఐదేండ్ల వరకు పదవీకాలం ఉండేలా కేంద్రం రెండు ఆర్డినెన్స్‌లను ప్రవేశపెట్టింది. ఆర్డినెన్స్‌లో మిశ్రా మరో ఏడాది పాటు కొనసాగేందుకు అవకాశం కల్పించింది.