Oct 29,2023 12:47

నెల్లూరు : ఎపిఎస్‌ఆర్‌టిసి డ్రైవర్‌లపై దాడి కేసుకు సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి వెల్లడించారు. బస్సు హారన్‌ కొట్టారంటూ.. కావలి పరిధిలో ఆర్టీసీ డ్రైవర్‌ బి.ఆర్‌.సింగ్‌, శ్రీనివాసరావులపై 14 మంది విచక్షణారహితంగా దాడికి పాల్పడిన సంగతి విదితమే. ఈ దాడిని ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ వేదిక తీవ్రంగా ఖండించింది. నిందితులు ఎంతటివారైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. దీనిపై నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్‌ రెడ్డి ఆదివారం మీడియాతో సమావేశమయ్యారు. ఆర్‌టిసి డ్రైవర్‌ పై దాడికి సంబంధించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశామని వెల్లడించారు. ఎస్పీ మాట్లాడుతూ ... నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ప్రధాన నిందితుడు దేవరకొండ సుధీర్‌ కోసం గాలిస్తున్నామని తెలిపారు. నేరం జరిగిన వెంటనే నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. నిందితులంతా నకిలీ నోట్ల మార్పిడి ముఠాకు చెందినవారని, ప్రజలను బెదిరించడం, మోసం చేయడం.. ఈ ముఠా నైజమని తెలిపారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు. ముఠాపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయని ఎస్పీ తెలిపారు.