Sep 20,2023 08:48
  • ఎఐకెఎస్‌, బికెఎంయు, ఎఐఎడబ్ల్యుయు, ఎఐఎఆర్‌ఎల్‌ఎ, ఎఐఎకెఎస్‌యు పిలుపు

న్యూఢిల్లీ : గ్రామీణ నిరుపేదలకు, అత్యంత అణచివేతకు గురైన వర్గాలకు జీవనోపాధి కల్పించే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్‌ఆర్‌ఇజిఎ)ని మనుగడలో లేకుండా చేసేందుకు మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం గత 9ఏళ్ళ నుండి కుట్రలు పన్నుతోంది. ఆ పథకంపై ప్రభుత్వం చేసే విధానపరమైన దాడులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అక్టోబరు 11న నిరసనలు పాటించాలని రైతు, కార్మిక సంఘాలైన ఎఐకెఎస్‌, బికెఎంయు, ఎఐఎడబ్ల్యుయు, ఎఐఎఆర్‌ఎల్‌ఎ, ఎఐఎకెఎస్‌యు-లు పిలుపిచ్చాయి. సాధారణంగా వ్యవసాయ కార్మికులు, గ్రామీణ కూలీల వేతనాలు క్షీణిస్తున్నా, చాలా ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం కింద వేతనాలు మాత్రం స్ధిరంగా వుంటున్నాయి, లేదా కాస్త పెరుగుదల నమోదు అవుతోంది.
            వాస్తవాలు ఇలా వున్నప్పటికీ ఈ పథకాన్ని రూపుమాపేయాలని మోడీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న నయా ఉదారవాద ఆర్థిక విధానాలు ఇందుకు కారణమవుతున్నాయి. ఈ పథకం అనవసరమైనదని, దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని ఆ విధానాలు పేర్కొంటున్నాయి. వరుసగా బడ్జెట్లలో తగినంతగా నిధులు కేటాయించకుండా మోడీ ప్రభుత్వం ప్రధానంగా దారుణమైన దెబ్బ తీస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 91శాతం నిధులు కేటాయించినవి ఖర్చు పెట్టేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధి హామీ కార్మికులు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. పని ప్రదేశాల్లో ఆన్‌లైన్‌ హాజరు నమోదు చేయించుకోవడం, ఆధార్‌ ప్రాతిపదికన చెల్లింపులు ఇవన్నీ పెద్ద సమస్యలుగా మారాయి.
          పార్లమెంట్‌లో అందచేసిన సమాచారం ప్రకారం, ఈ ఏడాది 51891168 జాబ్‌ కార్డులను నిరాధారణమైన కారణాలతో తొలగించారు. ఇటీవలే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరిగే పనుల పర్యవేక్షణకు డ్రోన్‌లను ఉపయోగించాలని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దానికోసం కొత్తగా కేటాయింపులేవీ జరపకపోయినా, డ్రోన్‌ సాంకేతికతను ఉపయోగించుకోవడంలో నైపుణ్యత కలిగిన సంస్థల సేవలను అద్దెకు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరారు.
      ప్రతిరోజూ ఉపాధి కార్మికులకు కొత్త సమస్యలు సృష్టించేందుకు ఇవన్నీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఎత్తుగడలు. పథకం పట్ల ఆసక్తిని కనబరచనీయకుండా కార్మికులను నిరుత్సాహానికి గురి చేసే కుట్రలే ఇవన్నీ. ఉపాధి కార్మికులు ఈ ఎత్తుగడలన్నింటినీ తోసిరాజని, పథకం అమలు కోరుతూ అక్టోబరు 11న దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు. అన్ని సంబంధిత సంస్థలు, ప్రగతిశీల వ్యక్తులు ఈ నిరసనలు, ఆందోళనల్లో పాల్గొని జయప్రదం చేయాలి. ప్రస్తుతం నిరుద్యోగం అధికంగా వున్న సమయంలో ప్రభుత్వం ఈ ఉపాధి హామీపథకాన్ని బలోపేతం చేసి, అదనపు కేటాయింపులు జరిపి, దాని అమలును సులభతరం చేయాలి.