ప్రజాశక్తి - ఆచంట (పశ్చిమగోదావరి):సాగు నీరివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మంగళవారం వరి దుబ్బులను రైతులు తలపై పెట్టుకొని నిరసన తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలంలోని ఆచంట వేమవరం శివారు పార్వతీ చెరువు, గుమ్ములూరు రోడ్డు మధ్యలో ఉన్న దేవ కాలువ శివారు లాకుల ప్రాంతంలో సుమారు 200 ఎకరాల వరకూ సాగునీరు అందడం లేదు, పంట కళ్లెదుటే ఎండిపోతోంది. దీంతతో ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతూ ఎపి కౌలు రైతు సంఘం ఆధ్వర్యాన ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు ఎండిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సార్వాకు సాగునీరందించలేకపోవడం సిగ్గుచేటని, రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. పంట పొలాలు ఈనిక దశలో ఉండడం, మరోవైపు వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో సాగునీరందక కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఏటా పంట కాలువల ఆధునికీకరణ పనులు చేయాల్సి ఉందని, తూతూమంత్రంగా కలుపు మందు కొట్టి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఇరిగేషన్ డిఇఇ సిహెచ్ ఎస్‌వివి సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సాగునీరందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు బంతు శ్రీనివాసరావు, కౌలు రైతులు ఉందుర్తి వెంకటేశ్వరరావు, బి రామాంజనేయులు, బి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.










