Jul 31,2023 16:38
  • ఆగస్టు 10వ తేదిన చిన్నారులకు వంద శాతం నులి పురుగుల నివారణ మాత్రలు అందజేయండి.
  • జిల్లా కలెక్టర్ డా.జి.సృజన

ప్రజాశక్తి-కర్నూలు అగ్రికల్చర్ : నులిపురుగుల నివారణ ద్వారా చిన్నారుల బాల్యాన్ని పరిరక్షించేందుకు గాను ఆగస్టు 10వ తేదిన నులి పురుగుల నివారణ మందులు అందించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేలా వైద్య, అనుబంధ శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమం అనంతరం నులిపురుగుల నివారణ పై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం రెండు పర్యాయాలు నిర్వహించడం జరుగతుందన్నారు. అందులో భాగంగా మొదటి విడత మార్చి 14వ తేదిన నిర్వహించడం జరిగిందని, అదే విధంగా ఆగస్టు 10వ తేదిన అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు‌‌ (ప్రభుత్వ మరియు ప్రైవేటు), జూనియర్ కళాశాలు, ఐటిఐ, పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న చిన్నారులకు, విద్యార్థులకు నులి పురుగు నివారణ మాత్రలు అందజేయాలన్నారు. అందుకు గాను 1సం. నుండి 2సం.లు ఉన్న చిన్నారులకు భోజనం తరువాత అల్బెండజోల్ సగం మాత్ర, 3సం.ల నుండి 19సం.ల విద్యార్థులకు అల్బెండజోల్ ఒక మాత్ర భోజనం అనంతరం అందజేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ నులి పురుగుల వల్ల ఆహారం జీర్ణం కాకపోవడం, రక్తహీనత తదితర అనారోగ్య రుగ్మతలు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలలో ఉన్న చిన్నారులకు అల్బెండజోల్ మాత్రలను అందజేయాలన్నారు. ఈ మాత్రలను తీసుకోవడం వల్ల రక్తహీనతను నిర్మూలించడంతో పాటు పోషకాహార ద్వారా వ్యాధినిరోధక శక్తిని మెరుగు పరచడంతో పాటు చదువు పై ఏకాగ్రత మెరుగవుతుందని రాష్ట్రీయ బాల స్వాస్థ్య (ఆర్బిఎస్కే) కో-ఆర్డినేటర్ డా.హేమలత జిల్లా కలెక్టర్ కు వివరించారు. ముఖ్యంగా ఈ నులిపురుగులు అపరిశుభ్రమైన ఆహారం, కలుషితమైన నీరు తీసుకోవడం వల్ల నులి పురుగులు ఏర్పడే అవకాశం ఉంటుందన్నారు. ఒకవేళ ఆగస్టు 10వ తేది పొరపాటున సదరు మాత్రలు తీసుకొని వారికి మరల మాప్-అప్ కార్యక్రమం ద్వారా ఆగస్టు 18వ తేది కూడా సదరు మాత్రలు ఇవ్వడం జరుగుతుందన్నారు. జ్వరం ఉన్నపుడు ఈ మాత్రలను తీసుకోకూడదన్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం ఆల్బెండలజోల్ మాత్రలు తీసుకున్న పిల్లలు స్కూల్లోనే ఉండాలన్నారు, వారికి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 108, 104 సిబ్బందిని అందుబాటులో ఉండాలన్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు అందజేయాలన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం కోసం చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మన అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు. అందుకుగాను అవసరమైన పోస్టర్లు, ఆడియో, దృశ్య మాధ్యమల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, డిఎంహెచ్ఓ డా.రామ గిడ్డయ్య, డిఈఓ రంగారెడ్డి, ఇంఛార్జి ఐసిడిఎస్ పిడి ఉమమహేశ్వరి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.