Oct 05,2023 17:29

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : లోపాలు లేని ఓటరు జాబితాను రూపొందించేందుకు అన్ని రాజకయపార్టీలు సహకరించాలని ఆదోని నియోజకవర్గ అధికారి, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ అన్నారు. ఆదోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఓటరు జాబితపై రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాను ప్రక్షాళన రాజకీయ పార్టీలకు అతీతంగా సహకరించాలన్నారు. ప్రస్తుతం ఆదోని నియోజకవర్గంలో 256 పోలింగ్‌ స్టేషన్లు ఉండగా వాటిలో 24 పోలింగ్‌ స్టేషన్లకు సదుపాయాలు సరిగా లేనందువలన కొత్త పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు. 24 పోలింగ్‌ స్టేషన్లకు లొకేషన్‌ మార్పుకు, ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామన్నారు. పోలింగ్‌ స్టేషన్ల మార్పుకు సంబంధించి ఏవైనా సూచనలు ఉంటే తెలియ చేయవచ్చని, వాటిని ఈఆర్వోలు పరిశీలించి తగిన నివేదికలు ఇస్తారని సబ్‌ కలెక్టర్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు.. పోలింగ్‌ స్టేషన్లు సాధ్యమైనంత వరకు ప్రభుత్వ భవనాల్లో ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పోలింగ్‌ స్టేషన్‌లలో ర్యాంప్‌, టాయ్లెట్‌ విత్‌ రన్నింగ్‌ వాటర్‌, కరెంట్‌ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. కుటుంబంసభ్యులందరూ ఒకే పోలింగ్‌ స్టేషన్‌లో ఓటు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని సబ్‌ కలెక్టర్‌ వివరించారు.